దద్దరిల్లిన జంతర్‌మంతర్‌ 

9 Feb, 2023 02:17 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా

ధర్నాలో పాల్గొన్న ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, కేకే  

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్‌ లాల్‌ కృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌ నరేశ్, రాజ్‌కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొని ప్రసంగించారు.

ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే 
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు