ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టేశారు

18 Mar, 2023 01:39 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై భట్టి ధ్వజం 

పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపేస్తామనడానికి మీరెవరని ప్రశ్న? 

సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

సాక్షి, ఆదిలాబాద్‌: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను సీఎం కేసీఆర్‌ అగ్నిగుండంలోకి నెట్టేశారని సీఎల్‌పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు ఎదురైందన్నారు. హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌ కొనసాగింపులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి భట్టి మొదలుపెట్టిన పాదయాత్ర రెండోరోజు శుక్రవారం బోథ్‌ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కొనసాగింది.

శుక్రవారం రాత్రి సిరికొండలో పాదయాత్రకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ గిరిజన బిడ్డల బతుకుల బాగు కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, మీ కుటుంబం బాగు పడడానికి కాదంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల గురించి  మాయమాటలు చెప్పి హౌసింగ్‌ శాఖనే ఎత్తివేసి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు భూముల పట్టాలివ్వకుండా గిరిజనులను వేధించి కేసులు పెడుతున్నారన్నారు.

మీ అబ్బ సొత్తా..: కాంగ్రెస్‌ పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని అనడానికి మీరెవరంటూ బీఆర్‌ఎస్‌ నేతలను భట్టి ప్రశ్నించారు. రాష్ట్ర సంపద ఏమైన మీ అబ్బ సొత్తా అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి న తర్వాత బోథ్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్నారు. అడ్డగోలుగా పెరుగుతున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించి రూ.500కే వంట గ్యాస్‌ ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని పీపుల్స్‌ గవర్నమెంట్‌ను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.   
 

మరిన్ని వార్తలు