రాజకీయాలకు బాబుల్‌ గుడ్‌బై!

1 Aug, 2021 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్‌ సుప్రియో రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముందు సుప్రియోతో పార్టీ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ‘రాజకీయాలు వీడాలని నిర్ణయించుకున్నాను. నేను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం సహా మరే ఇతర పార్టీలోకి వెళ్లడం లేదు. ఎప్పటికీ బీజేపీతోనే ఉంటా.  రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదు’ అంటూ బాబుల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తనకు అవకాశమిచ్చినందుకు అమిత్‌షా, నడ్డాలకు బాబుల్‌ కృతజ్ఞత చెప్పారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని వీరు అడిగారని, కానీ తనను మన్నించి తన కోరికను ఆమోదించాలని కోరారు.

బాబుల్‌ ప్రస్థానం
ప్రముఖ గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్సోల్‌ నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

దీంతో అధిష్టానం ఆయన్ను మంత్రి పదవి నుంచి దిగిపొమ్మని కోరింది. ‘పదవి పోవడం వల్ల రాజకీయాలు వదిలేస్తున్నావా అని ఎవరైనా అడిగితే కొంతమేరకు అవుననే అంటాను. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వంతో విబేధాలు కూడా కొంత వరకు కారణమే’ అని బాబుల్‌ తెలిపారు. బాబుల్‌ రాజీనామాపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పందించలేదు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తనకు తెలియదని, సోషల్‌ మీడియాను తాను ఫాలో కానని చెప్పారు. ఇదంతా డ్రామా అని టీఎంసీ ఎద్దేవా చేసింది. మంత్రి పదవి దక్కనందుకే బాబుల్‌ ఇలా చేస్తున్నారని, రాజీనామా చేసేట్లయితే స్పీకర్‌కు ఫార్మెట్లో పంపాలని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు