కోకాపేట భూములను బీఆర్‌ఎస్‌ నేతలు కాజేస్తున్నారు: బండి సంజయ్‌

21 May, 2023 16:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. కోకాపేటలో రూ. వేల కోట్ల విలువ చేసే భూములపై సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్‌ఎస్‌ కోకాపేట భూములను లూటీ చేసిందని సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, బండి సంజయ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపించలేదు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకువస్తారు. ఎన్నికల తర్వాత భూములను లాక్కుంటున్నారు. ధరణి పోర్టల్‌తో బీఆర్‌ఎస్‌ నాయకులు బాగుపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఆఫీసులకు భూములను రూ.100లకే లీజుకు తీసుకుంటున్నారు. కోకాపేటలో రూ.వేల కోట్ల విలువ చేసే భూములను ఒక సంస్థ పేరుతో బీఆర్‌ఎస్‌ నాయకులు తీసుకుంటున్నారు. 11 ఎకరాలు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శికి రూ. 40కోట్లకు ఇచ్చారు. గజానికి రూ.1.10 లక్షల విక్రమానికి హెచ్‌ఎండీఏ నోటీసు ఇచ్చింది. 

గతంలో కాంగ్రెస్‌ పార్టీ స్థలం తీసుకున్నా ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్‌ఎస్‌ కోకాపేట భూములను లూటీ చేసింది. దోపిడీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీపడుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ వదిలిపెట్టదు. అందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలి. ఆ స్థలం కోసం బీజేపీ పోరాటం చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో బీఆర్‌ఎస్‌ రాక్షసానందం పొందుతోంది. డబ్బుల కోసమే సీఎం కేసీఆర్‌ 111 జీవోను రద్దు చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: 111 జీఓ రద్దు ఎఫెక్ట్‌.. ఇక నో ఫాం హౌస్‌..!

మరిన్ని వార్తలు