కాంగ్రెస్‌ నేతల గుడ్‌బై.. బలపడుతున్న బీజేపీ

24 Feb, 2021 19:23 IST|Sakshi

ఉమ్మడి జిల్లాపై బీజేపీ ప్రధాన దృష్టి

బీజేపీలో చేరిన పాల్వాయి హరీశ్‌ బాబు

వలసలు కొనసాగుతాయంటున్న బీజేపీ నేతలు

వలసలతో మారనున్న రాజకీయ ముఖచిత్రం

సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజవర్గాల్లోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పార్టీని వీడడంతో ఆ పార్టీకి భారీ నష్టం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలను కలసి వచ్చారు. ఇక ఆయన చేరిక లాంఛనమే అని భావించారు. కానీ.. స్థానికంగా ఉన్న కేడర్‌ కారణంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మల్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, పెంబి జెడ్పీటీసీ జానకీబాయి ఇప్పటికే బీజేపీలో చేరారు. బోథ్‌ నియోజవర్గం నుంచి మాజీ ఎంపీ గోడం నగేశ్‌ అనుచరుడు, ఆదిలాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు జీవీ.రమణ బీజేపీలో చేరారు.

తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న సిర్పూర్‌ నియోజవర్గ ఇన్‌చార్జి పాల్వాయి హరీశ్‌బాబు తన అనుచరగణంతో మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగజ్‌నగర్‌లో ‘ఛత్రపతి శివాజీ సంకల్ప సభ’ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తదితర సీనియర్‌ నేతల నేతృత్వంలో ఆయన కాషాయ పార్టీలో చేరారు. మంచిర్యాల, చెన్నూరు పరిధిలో ద్వితీయ శ్రేణీ నాయకులు, యువత బీజేపీలో చేరుతున్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో మరిన్ని వలసలు ఉంటాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. వీరితోపాటు మరికొందర్ని బీజేపీలోకి చేర్చుకునే దిశగా నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాపై బీజేపీ ఫోకస్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో తొమ్మిది టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా.. ఆసిఫాబాద్‌ స్థానం కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానమైన టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టి మొదటిసారిగా ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్‌సభ సీటును మాత్రం టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులతో బీజేపీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే పార్టీ అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై ఫోకస్‌ చేస్తూ.. వివిధ పార్టీల నుంచి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల చేరికలకు తలుపులు తెరిచి ఉంచింది.

దీంతో మాజీలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలం పెరుగుతోంది. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఇటీవల నిర్మల్, బోథ్‌ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా జనరల్‌ స్థానాల్లో పర్యటిస్తూ.. చేరికలకు క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలో మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ చెన్నూరుతోపాటు, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన పర్యటనలతో కోల్‌బెల్ట్‌ పరిధిలో కార్మిక నాయకులతోపాటు గ్రామాలు, మండలాల్లో ద్వితీయ శ్రేణీ నాయకులు, కొత్తగా పార్టీలో చేరుతున్న యువతకు ఉత్సాహం కలిగిస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ చరిష్మా, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతనే తమ పార్టీ బలపడడానికి ప్రధాన కారణాలని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ మారే అవకాశం ఉంది. 

చదవండిఈ కారుకు నిబంధనలు వర్తించవా?!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు