జమ్మూ బీజేపీ రెబల్స్‌పై సస్పెన్షన్‌ వేటు

4 Dec, 2020 11:52 IST|Sakshi

శ్రీనగర్‌: ఉన్నత పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధికి తోడ్పడాల్సిన నేతలే ఇతరులకు అనుకూలంగా వ్యవహరించారంటూ బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలతో 10 మందిపై వేటు వేసింది. ఒక పార్టీలో ఉంటూ వేరొకరికి కొమ్ముకాయడాన్ని తీవ్రంగా పరిగణించిన జమ్మూ కశ్మీర్‌ కార్యవర్గం గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లా అభివృద్ధి మండలి(డిసిసి)తో పాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకం‍గా పనిచేసినందుకు వారిపై వేటు వేసింది.

ఈ విషయం గురించి స్థానిక బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చర్యలు కార్యకర్తలపై చెడు ప్రభావం చూపిస్తాయి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే  విధంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్టానం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తే సహించబోమన్న సంకేతాలు ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు.

సస్పెన్షన్‌కు గురైన నేతలు:
పార్టీ జనరల్‌ సెక్రటరీ సంతోష్‌ కుమారీ, సతీష్‌ శర్మ, మకన్‌ లాల్‌ జమోరీయా, నీనా రకవాల్‌, గరిమల్‌ సింగ్‌, లోకేష్‌ సంబ్రియా, తీరత్‌ సింగ్‌, రన్‌బీర్‌ సిం‍గ్‌ తదితర నేతలు సస్పెన్షన్‌కు గురైన జాబితాలో ఉన్నారు. మొత్తం పది మంది నేతల్లో 8 మంది పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని పార్టీ వీరిని సస్పెండ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు