విద్వేషపూరిత వ్యాఖ్యలకు ప్రమోషన్ ఇచ్చారు: కపిల్ సిబాల్ 

28 Sep, 2023 15:17 IST|Sakshi

జైపూర్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు జైపూర్‌లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై మరోసారి డానిష్ అలీ స్పందిస్తూ ఇది ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు దక్కిన బహుమతి అయి ఉంటుందని అన్నారు. 

ప్రమోషన్.. 
పార్లమెంట్‌లో రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్న అధిష్టానం ఆయనకు టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ బుధవారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. 

అక్కడ ఆయనైతేనే కరెక్టని.. 
సమావేశాలు ముగిశాక డానిష్ అలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలను మతపరంగా దూషించడానికే నిర్వహించారని బీజేపీ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని ఆరోజే వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందన్నారు. ఆ జిల్లాలో 30 శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. 

నేనేమీ అనలేదు.. 
అంతకుముందు డానిష్ అలీ ప్రధాని కులాన్ని దూషించిన కారణంగానే రమేష్ బిధూరీ అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ బీజేపీ నేతలు విమర్శించగా అందులో డానిష్ అలీ ఎక్కడా ప్రధాని కుల ప్రస్తావన చేయలేదని.. ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఒక తీవ్రవాదిని ఎలా అనుమతించారని మాత్రం ప్రశ్నించిన సంభాషణలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చదవండి: ‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్‌ ఇవ్వడం లేదు’

మరిన్ని వార్తలు