2024 లోక్‌సభ ఎన్నికలు; మమత కీలక వ్యాఖ్యలు

9 Mar, 2022 13:07 IST|Sakshi

కోల్‌కతా: ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజున ప్రజలు ఆ పార్టీని సాగనంపడం ఖాయమని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అటువంటి ప్రత్యామ్నాయాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు తమ టీఎంసీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రయత్నిస్తోందని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని.. ఇందుకోసం చురుగ్గా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

పార్టీ అధినేతగా గత నెలలో మరోసారి ఎన్నికైన మమతా బెనర్జీ.. తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. సీనియర్లు, కొత్త నేతలకు సమతౌల్యం పాటిస్తూ విధేయతకు పెద్దపీట వేశారు. సుబ్రతా బక్షీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్థా చటర్జీని ప్రధానకార్యదర్శిగా మళ్లీ నియమించారు. అదేవిధంగా, పార్టీ ఉపాధ్యక్షులుగా సుమారు 20 మందిని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా హాజరయ్యారు. సీనియర్‌ నేతలతో కలిసి ఆయన వేదికపై ఆసీనులయ్యారు.   

మమత.. బెంగాల్‌కే పరిమితం
తమ పార్టీని ఓడించాలన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందించారు. మమతా బెనర్జీ బెంగాల్‌కే పరిమితమని.. కేంద్రంలో బీజేపీని ఓడించే సత్తా ఆమెకు లేదన్నారు. ‘ఇంత పెద్ద లక్ష్యం వారి (టీఎంసీ) ఆరోగ్యానికి మంచిది కాదు. ఆమె (సీఎం మమతా బెనర్జీ) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుస్తారని అనుకోలేం. సార్వత్రిక ఎన్నికల్లో వారిని భంగపాటు తప్పద’ని సుకాంత మజుందార్ అన్నారు. (క్లిక్‌: బీజేపీ నుంచి ఔట్‌.. మమత పార్టీలోకి మరో సీనియర్‌ నేత)

మరిన్ని వార్తలు