‘పునర్వ్యవస్థీకరణ’ను నీరుగార్చింది టీడీపీనే

11 Mar, 2022 04:10 IST|Sakshi

పోలవరం పేరుతో భజన చేయించుకుని దానిని అటకెక్కించారు

ప్యాకేజీ ఒప్పుకుని ప్రత్యేక హోదానూ గాలికి వదిలేశారు

విద్య, వైద్యంలో ఏపీ తర్వాతే ఇతర రాష్ట్రాలు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ కట్టుకథలు చెబుతోందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై ఆరోపణలు చేస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ప్యాకేజీలకు ఒప్పుకుని చంద్రబాబు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చారన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా గురువారం వాడివేడిగా చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు సైతం సభకు హాజరవడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే సమయంలో వారు అడ్డుతగిలేందుకు యత్నించారు. ఆ సమయంలో బుగ్గన కలుగజేసుకుని వారి ఆరోపణలను తిప్పికొట్టారు.

అంబటి రాంబాబు ప్రసంగించిన తర్వాత మైక్‌ను జోగి రమేష్‌కు ఇవ్వగా.. నిమ్మల రామానాయుడు కోరడంతో ఆయనకు అవకాశమిచ్చారు. దీంతో ఆయన.. రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలు వాస్తవంగా కుంటుపడ్డాయని, సంక్షేమమన్నది రాష్ట్రంలో లేదని చెప్పడంతో మంత్రి బుగ్గన ఖండించారు. ఆయన ఏమన్నారంటే.. ‘కేంద్రం నుంచి ప్యాకేజీ తీసుకుని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చారు. సోమవారం పోలవరం పేరుతో భజన చేయించుకుని ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని మీరు వదిలేస్తే దాని నిర్మాణ బాధ్యత మేం తీసుకుని తిరిగి ప్రారంభించాం.

పెద్దఎత్తున గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ ఉద్యోగాలు భర్తీచేశాం, మరో 10,143 పోస్టులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి భర్తీచేస్తున్నాం, వైద్య విభాగంలో దాదాపు 23 వేల ఉద్యోగాలు భర్తీచేశాం.. ఇవన్నీ ఉద్యోగాల భర్తీ కాదా? విద్య, వైద్య రంగాల అభివృద్ధిలో ఏపీ తర్వాతే ఇతర రాష్ట్రాలు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదాను నీరుగార్చి ఇప్పుడు టీడీపీ డ్రామాలు అడుతోందని, ప్యాకేజీకి ఒప్పుకుని విభజన హామీలు గాలికి వదిలేశారని కూడా మండిపడ్డారు.  ఉక్రెయిన్‌ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను జూమ్‌లోకి ఆహ్వానించి అభినందించడం టీడీపీ వారికే చెల్లిందని బుగ్గన ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు