గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

17 Sep, 2022 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించడం చాలా  సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్‌లూ వేదికలు కావాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా, సరైన పంథాలో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శనివారం ఆదివాసీ-బంజారా ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఆదివాసీ- బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధులాగే.. త్వరలోనే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. భూమి లేని గిరిజనులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ఇది టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఫైట్‌ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్‌ ఫైర్‌

ఇంకా మాట్లాడుతూ.. ‘సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లే వర్తించాయి. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందట కేంద్రానికి పంపాం. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నా. విభజన రాజకీయం మొదలు పెట్టిన హోం​మంత్రిని అడుగుతున్నా. గిరిజన రిజర్వేషన్లను మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారు. మోదీ పుట్టిన రోజున చేతులు జోడించి అడుగుతున్నా. రిజర్వేషన్లను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడండి

రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోంది. మా న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. పోడు రైతలకు ఇచ్చేందుకు భూములు గుర్తించాం. పోడు భూములు రైతులకు ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నా. గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కల్లోలానికి గురికానివొద్దు.  మోదీ మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా’ అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

చదవండి: అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ నుంచి అవుట్‌..

మరిన్ని వార్తలు