Congress Plenary: ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..

26 Feb, 2023 13:58 IST|Sakshi

రాయ్‌పూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.

'భారత్‌ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.' అని రాహుల్ వ్యాఖ్యానించారు.

జైశంకర్‌పై ఆగ్రహం..
ఆర్థికంగా చైనాను భారత్‌ అధిగమించలేదని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఆయనకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నించారు. చైనాతో ఫైట్ చేయలేమని ఎలా అంటారని నిలదీశారు.

ప్రభుత్వాన్ని నిలదీద్దాం..
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పార్టీని మండల, బ్లాక్ స్థాయిలో బలోపేతం చేయాలని, ఇది కాగితాలకే పరిమితం కావొద్దని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కలిసి ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. కమలం పార్టీని గద్దె దించేందుకు ఎంత ధైర్యం కావాలో తమకు తెలుసన్నారు. దేశ ప్రజల కోసం దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు.
చదవండి: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏఐసీసీ  పదవులపై చర్చ .. కోమటిరెడ్డికి అవకాశం దక్కేనా?

మరిన్ని వార్తలు