Huzurabad Bypoll: గెల్లుతో బల్మూరి ఢీ!

2 Oct, 2021 01:46 IST|Sakshi

హుజూరాబాద్‌ బరిలో మరో విద్యార్థి నేత

కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ నేత పేరు దాదాపు ఖరారు

టీఆర్‌ఎస్‌ వ్యూహానికి ప్రతి వ్యూహం

ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన వ్యక్తి కావడంతో ప్రాధాన్యం

నేడో, రేపో ప్రకటించే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నర్సింగరావు పేరు ఖరారయినట్టేనని తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు వెళ్లాయని, ఏఐసీసీ ఆమోదంతో నేడో, రేపో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు కూడా పంపినప్పటికీ విద్యార్థి సంఘం నాయకుడు, వెలమ సామాజిక  వర్గానికి చెందిన వెంకట్‌ పేరే అధికారికంగా ఖరారవుతుందని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. 

సీఎల్పీ సై .. పీసీసీ ఓకే
టీఆర్‌ఎస్‌ తరఫున టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలో దించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పేరు పరిశీలనకు వచ్చింది. సీఎల్పీ నేత భట్టి ఈ ప్రతిపాదన చేయగా మాజీ మంత్రులు, కరీంనగర్‌ జిల్లా నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌ బాబులు సంపూర్ణంగా మద్దతిచ్చారు.   ఇందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ మరోసారి సమావేశమై వెంకట్‌ పేరును ఖరారు చేసి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది.

వెంకట్‌  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాయకుడు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన స్వగ్రా మం ఉంది. 2018 ముందస్తు ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ రాలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పటికీ విద్యార్థి సంఘాన్ని వెంకట్‌ పరుగులు పెట్టించారు. అనేక విద్యార్థి సంబంధిత అంశాలపై ఎన్‌ఎస్‌యూఐని క్రియాశీలకంగా నడిపించడంతో పాటు మంత్రి మల్లారెడ్డి అవినీతి విషయంలో ఆందోళనలు చేసి కేసుల పాలయ్యారు. కరోనా తదనంతర విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమ స్యలను తీసుకెళ్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగ ణనలోకి తీసుకుని వెంకట్‌ను బరిలో దింపుతు న్నామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. 

పార్టీ అభిమతమే ఫైనల్‌: వెంకట్‌
హుజూరాబాద్‌లో పోటీ విషయమై పార్టీ తనను అడిగిందని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకట్‌ వెల్లడించారు. పార్టీ అభిమతమే ఫైనల్‌ అని చెప్పానని తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి విద్యార్థి సంఘం నేత బరిలోకి దిగిన నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఈ ఎన్నికల వేదికగా ప్రజలకు వివరిస్తామని వెంకట్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు