అనూహ్య పరిణామం: హత్యలు-అత్యాచార దోషి.. ఎన్నికల వేళ జైలు నుంచి బయటకు!

7 Feb, 2022 13:49 IST|Sakshi

హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు ఫర్లాగ్‌(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు..

2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్‌ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్‌ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్‌ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్‌ సింగ్‌ బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇంతకు ముందు తన మెడికల్‌ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్‌ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్‌ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్‌ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్‌ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్‌ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్‌ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్‌ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్‌ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్‌​ చేస్తూ ఉంటారు.

మరిన్ని వార్తలు