Huzurabad Bypoll Results: బాగారెడ్డి రికార్డును సమం చేసిన ఈటల.. అడ్డురాని 7వ నంబర్‌

3 Nov, 2021 03:32 IST|Sakshi

బీసీ నేతను అక్కున చేర్చుకున్న కమలాపూర్, హుజూరాబాద్‌ ప్రజలు

ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆదరించిన ఓటర్లు.. టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుసార్లు, ఏడోసారి బీజేపీ నుంచి గెలుపు

‘చంపుకుంటారా.. సాదుకుంటారా’ అంటే.. సాదుకుంటామన్న ఓటర్లు

చరిత్రాత్మక ఎన్నికల్లో ఈటల గెలుపుపై సర్వత్రా చర్చ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/కరీంనగర్‌: ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ఓటమె రుగని నేతగా రికార్డు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలోనూ విజయం ఆయననే వరించింది. క్రమశిక్షణగల కార్యకర్తగా, నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఈటల పని చేశారు.

అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బలంగా వినిపించారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరిం చిన రాజేందర్‌ అనివార్యంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతీయ జనతా పార్టీలో చేరి ఉప ఎన్నికల బరిలో నిలబడిన ఆయనను హుజూరాబాద్‌ ప్రజలు అంత కుముందులానే ఆదరించారు. ‘చంపుకుంటారా.. నన్ను సాదుకుంటారా.. మీ ఇష్టం’అన్న ఈటలను గెలిపించి.. ‘సాదుకుంటాం’అన్న సంకేతాలిచ్చారు. 

ఈటల రాజకీయ ప్రస్థానం...
రాజేందర్‌ రాజకీయ ప్రస్థానం 2002లో మొదలైంది. ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్‌ గ్రామానికి చెందిన ఆయన పౌల్ట్రీ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గజ్వేల్‌ ప్రాంతంలో కోళ్ల ఫారాలు నిర్మించుకున్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించగా, 2002లో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అనూహ్యంగా కమలాపూర్‌ నుంచి పోటీ చేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచించారు.

టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఢీకొనే అభ్యర్థి లేడనుకున్నా.. 2004లో పోటీచేసి ఈటల ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్‌ రద్దయింది. 2009లో హుజూరాబాద్‌ కేంద్రంగా కమలాపూర్, జమ్మికుంట(పాతది), వీణవంక మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. 2009 నుంచి 2021 వరకు జరిగిన సాధారణ, ఉప పోరులో ఈటల హుజూరాబాద్‌ నుంచి ఐదు పర్యాయాలు అప్రతిహతంగా విజయం సాధించారు. 


(చదవండి: 8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ)

అడ్డురాని 7వ నంబర్‌
వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈటల గత రికార్డును సమం చేశారు. జహీరా బాద్‌ నుంచి ఎం.బాగారెడ్డి వరుసగా (1957, 62, 67, 72, 78, 83, 85) అసెంబ్లీకి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఈటల తాజా విజయంతో సమం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ఏడో నంబర్‌ ఎవరికీ కలసిరాలేదు. దీంతో ఏడో నంబరు అంటే నేతలంతా భయపడేవారు. అసలు ఏడోసారి పోటీ చేసే వరకు రాజకీయ, శారీరక అనుకూలతలు కూడా కలిసిరావాలి కూడా. ఇవి రెండూ ఈటలకు కలిసిరావడం గమనార్హం.

రెండుసార్లు మంత్రిగా...
రాజేందర్‌ 2004 నుంచి టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌ మంత్రివర్గంలో రెండుసార్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2018 నుంచి కేసీఆర్, ఈటల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రివర్గం నుంచి సీఎం తొలగించడంతో ఆత్మాభిమానం పేరిట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలను కేసీఆర్, ఈటల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈటలపై మరో తెలంగాణ ఉద్యమకారుడు, నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌కు చెందిన గెల్లు శ్రీనివాస్‌ను తమ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ బరిలో నిలిపింది. అధిష్టానమే అన్ని తానై వ్యవహరించింది. అయినా మంగళవారం ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్‌ ఘన విజయం సా«ధించారు. 

5సార్లు ఓట్ల శాతం..సగానికి సగం
ఈటల రాజేందర్‌ వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తే.. అందులో ఐదుసార్లు 50 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. తొలుత కమలాపూర్, తర్వాత హుజూరాబాద్‌ శాసనసభకు ప్రతినిధ్యం వహించిన రాజేందర్‌.. 2008 ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికలో మాత్రమే 50 శాతానికి తక్కువగా ఓట్లు పొందారు. 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 59.34% ఓట్లు పొందిన ఈటల.. అదే స్థానం నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా 52.02% ఓట్లు సాధించారు. 2018లో హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి రఘు 1,683 ఓట్లే (0.95%) పొందగా, నోటాకు 2,867 ఓట్లు రావడం గమనార్హం. ఇదిలాఉండగా, హుజూరాబాద్‌ తాజా ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. 2018 ఎన్నికల్లో 61,121(34.60%) ఓట్లు రాగా, ఈ ఉప ఎన్నికలో 1.5 శాతం ఓట్లతో దారుణ ఓటమి చవిచూసింది. 


(చదవండి: Telangana: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌)

మరిన్ని వార్తలు