కోవిడ్‌ చికిత్సకు మోనోక్లోనల్‌ యాంటీబాడీలు భేష్‌

3 Nov, 2021 02:00 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

సమస్యలు ముదరకుండా కట్టడి

అధ్యయనంలో తేలిందన్న ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) డెల్టా రూపాంతరితాన్ని కూడా నియంత్రించగల మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స సమర్థతను ధ్రువీకరించింది. దాదాపు 285 మందిపై జరిపిన అధ్యయనం ద్వారా ఈ చికిత్స తేలికపాటి, మధ్యస్థాయి కోవిడ్‌ రోగుల సమస్యలు ముదరకుండా, ఆసుపత్రి పాలవకుండా కాపాడుంతుందని, మరణాలను 100 శాతం అడ్డుకుంటుందని తెలిసింది. సీసీఎంబీ, డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం వివరాలను ఏఐజీ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే ఈ చికిత్స అందరికీ ఇవ్వడం సరికాదని చెప్పారు.

గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్‌ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్‌ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందని, తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి, ప్రమాదం లేని వారికి అనవసరంగా ఈ ఇంజెక్షన్లు ఇవ్వరాదన్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఇంజెక్షన్‌ తీసుకుంటే కోవిడ్‌ నుంచి 3 నెలలపాటు రక్షణ లభిస్తుందని... కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కోవిడ్‌ బారిన పడి మిగిలిన వాళ్లకు సోకే ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్‌ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్‌ తీసుకోవడం మేలని తెలిపారు. 

యాంటీబాడీలు పనిచేసేదిలా...
మానవ కణాల నుంచి సేకరించి వృద్ధి చేసిన యాం టీబాడీలే ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీలు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ రోష్‌ రీజెన్‌ కోవ్‌ పేరుతో ఈ యాంటీబాడీ మిశ్రమాన్ని తయారు చేసింది. ఈ ఏడాది మేలో కేంద్రం మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు అనుమతులిచ్చింది. ఫలితంగా వైరస్‌ కణంలోకి ప్రవేశించేందుకు వీల్లేకుండా పోతుంది. 

ట్రంప్‌ తీసుకున్న మందే... 
కోవిడ్‌ వచ్చిన తొలినాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ప్రయోగాత్మక మందే ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీ. అప్పట్లో దీనిపై తగిన శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు. మోనోక్లోనల్‌ యాంటీబాడీలు కోవిడ్‌ను ఎదుర్కోగలవని కొన్ని అధ్యయనాలు తెలిపినప్పటికీ డెల్టా రూపాంతరితంపై ఎలాంటి పరిశోధనలూ లేవు.  ఏఐజీకి చెందిన ఏసియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ నేతృత్వంలో తాము పరిశోధన మొదలుపెట్టామని, ఏఐజీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్‌ రోగుల్లో 288 మందిని రెండు గుంపులుగా విడదీసి ప్రయోగాలు చేశామని డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారిలో 208 మందికి రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వారికి రెమిడెస్‌విర్‌ మందు ఇచ్చామని చెప్పారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది డెల్టా రూపాంతరిత బాధితులు. వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన 78 శాతం మందిలో లక్షణాలు తగ్గగా రెమిడెస్‌విర్‌ తీసుకున్న వారిలో ఈ సంఖ్య 50 శాతంగా ఉంది.   వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన వారు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కాగా, రెమిడెస్‌విర్‌ తీసుకున్నవారిలో 52 శాతం మంది పాజిటివ్‌గానే ఉన్నారు. యాంటీబాడీలు తీసుకున్నవారిలో కోవిడ్‌ అనంతర ఇబ్బందులేవీ కనిపించలేదని, ఒక్కరిలోనూ లక్షణాలు తీవ్రం కావడం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. 

అందరికీ కాదు... 
మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కోవిడ్‌ నుంచి తేరుకునేందుకు ఉపయోగపడుతున్నప్పటికీ ఇది అందరికీ ఇవ్వడం సరికాదని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికుల్లో కోవిడ్‌ లక్షణాలేవీ కనపడవని, బయటపడ్డ వారిలోనూ అతికొద్ది మందే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని గుర్తుచేశారు. గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్‌ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్‌ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందన్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు.  ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్‌ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్‌ తీసుకోవడం మేలని తెలిపారు.


మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స ఎవరికి? 

 •  65 ఏళ్ల పైబడ్డ వారికి 
 • ఊబకాయం (బాడీ మాస్‌ ఇండెక్స్‌ 35 కంటే ఎక్కువ ఉన్న వారు) 
 • గర్భిణులు 
 • కిడ్నీ వ్యాధులు ఉన్న వారు (క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌) 
 • మధుమేహం ఉన్న వారికి 
 • రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు వాడేవారు. 
 • గుండెజబ్బులు ఉన్న వారు లేదా అధిక రక్తపోటు కలిగిన వారు 
 • తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి సికిల్‌ సెల్‌ అనీమియా బాధితులు 
 • సెరెబ్రల్‌ పాల్సీ వంటి నాడీ అభివృద్ధి సమస్యలు ఉన్న వారికి 

ఎప్పుడు ఇవ్వాలి?

 • ఆర్‌టీ–పీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు. లేదా లక్షణాలు కనిపించిన ఐదవ రోజు లోపు. రెండింటిలో ఏది ముందైతే దానికి అనుగుణంగా ఈ మందు తీసుకోవాలి. 
 • ఆక్సిజన్‌ అవసరం ఏర్పడ్డ వారు లేదా కోవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి ఈ చికిత్స ఇవ్వవచ్చా? అన్న అంశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలో ప్రచురితం కానున్నాయి. 
 • వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు కనీసం 45 రోజుల సమయం పడితే.. మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో వెంటనే ప్రభావం కనపడుతుంది.  

మరిన్ని వార్తలు