Ghulam Nabi Azad: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్‌

26 Aug, 2022 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం గులాం నబీ ఆజాద్ నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ పార్టీలో చేరుతారు? అని జోరుగా చర్చ మొదలైంది. ఆయన బీజేపీలో చేరుతారానే ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిపై ఆజాద్ స్పష్టతనిచ్చారు. తాను బీజీపీతో అసలు టచ్‌లో లేనని చెప్పారు. జమ్ముకశ్మీర్లో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు.

తాను ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూడటం లేదని ఆజాద్‌ వివరించారు. ఇప్పటికైతే సొంత రాష్ట్రానికే పార్టీని పరిమితం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై భవిష్యత్తులో ఆలోచిస్తానన్నారు. అయితే తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఆజాద్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు.

రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న ఆజాద్‌.. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈమేరకు ఐదు పేజీల లేఖను సోనియా గాంధీకి పంపారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013లో ఆయన ఉపాధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచే పార్టీ నాశనమైందని ఆరోపించారు. రాహుల్ వచ్చాక పార్టీలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవట్లేదని, సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికారని ధ్వజమెత్తారు.

మరోవైపు ఆజాద్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పార్టీ నేతలు ఆయనకు ఎంతగానో గౌరవించారని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో ఆజాద్ పార్టీకీ ద్రోహం చేశారని, ఆయన డీఎన్‌ఏ 'మోడీ-ఫై' అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఘాటు విమర్శలు చేశారు.
చదవండి: ఆజాద్‌ది ద్రోహం.. ఆయన ఆరోపణల్లో నిజం లేదు

మరిన్ని వార్తలు