ప్రతీరోజు మండలానికో ముఖ్యనేత

17 Oct, 2021 02:52 IST|Sakshi

హుజూరాబాద్‌ ఎన్నిక ప్రచార వ్యూహం ఖరారులో బీజేపీ 

20 నుంచి బండి, 21 నుంచి కిషన్‌రెడ్డి విస్తృత ప్రచారం 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం బీజేపీ పకడ్భందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల 27న ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో తదనుగుణంగా దశలవారీగా వివిధ స్థాయిల నేతలు ప్రచారంలో పాల్గొనేలా కార్యచరణ రూపొందిస్తోంది. ఉప ఎన్నిక ప్రచార సమయం ముగిసే దాకా రోజూ నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో పార్టీకి చెందిన ఎవరో ఒక ముఖ్యనేత ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది.

అధికార టీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ 27న హుస్నాబాద్‌లో లేదా ముల్కనూర్‌లో ప్రచారాన్ని ముగించే అవకాశాలున్నాయి. దీంతో కేసీఆర్‌ సభకు ధీటుగా తాము ప్రచారాన్ని సమాప్తం చేయాలని బీజేపీ భావిస్తోంది. హుజూరాబాద్‌కు ఆనుకుని ఏదో ఒక చోట కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, మరికొందరు నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం.  

ముఖ్యనేతల ప్రచారంతో ఊపు... 
రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు విస్తృత ప్రచారం జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రచార పర్వం ముగిసే దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్‌కుమార్‌ హుజూరాబాద్‌ వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మండలాలు, మున్సిపాలిటీలను చుట్టివచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

ఇదిలాఉంటే సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ పార్టీ ఇన్‌చార్జీ మురళీధర్‌రావు ఆదివారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపేటలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.  

శక్తి కేంద్రాల ద్వారా పర్యవేక్షణ... 
గ్రామస్థాయిలో పార్టీ కేడర్‌ను పోలింగ్‌ బూత్‌ల వారీగా వర్గీకరించి తదనుగుణంగా ప్రచార నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. గ్రామస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయానికి మూడు, నాలుగు పోలింగ్‌ సెంటర్లను కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శక్తి కేంద్రాల బాధ్యులు ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లను కలిసి, సమన్వయం చేసేందుకు పన్నా ప్రముఖ్‌ (ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ ఓటర్ల ఇన్‌చార్జీ)ను కూడా నియమించి.. బీజేపీ ముందుకు సాగుతోంది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు