గంగుల vs ఈటల.. ఎవరి బలమెంత?

17 May, 2021 08:31 IST|Sakshi

గంగుల, ఈటల వర్గాలుగా విడిపోయిన నాయకులు

మంత్రి గంగులతో కొనసాగుతున్న నాయకుల భేటీలు

పార్టీ వెంటే ఉంటామన్న జెడ్పీటీసీ, ఎంపీపీలు 

ఈటల గూటికి జమ్మికుంట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు 

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలగాన్ని పెంచుకునే దిశగా జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఈటల వైపు వెళ్లకుండా ఒప్పిస్తున్నారు. నియోజకవర్గంలో గంగుల జోక్యంపై శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసిన విధంగా 20 ఏళ్లుగా తన వెంట ఉన్న నాయకులను మంత్రి గంగుల బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అదే సమయంలో ఇల్లందకుంట మండలానికి చెందిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈటలను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీన్‌ కరీంనగర్‌కు మారింది. పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంగులను కలిసి తాము పార్టీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈటలపై విమర్శలు కురిపించారు. 

పార్టీతోనే మండల ప్రజాప్రతినిధులు
హుజూరాబాద్‌ జెడ్పీటీసీ బక్కారెడ్డి, ఎంపీపీ రాణి సురేందర్‌రెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత, వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి తదితరులు ఆదివారం మంత్రి గంగుల నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. తమతోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పార్టీని వీడి ఈటల వద్దకు వెళ్లే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం వల్ల స్థానికంగా నాయకులు స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ లభించిందని అన్నారు. పార్టీలో ద్వితీయ నాయకత్వం ఎదగకుండా తొక్కిపెట్టారని వారు ఈటలపై ఆరోపణలు చేశారు. వీరితోపాటు కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని శనిగరం, మర్రిపల్లిగూడెం గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు గంగులను కలిసి పార్టీ వెంట ఉంటామని చెప్పారు.

పార్టీ సీనియర్‌ నాయకుడు పింగళి ప్రదీప్‌ రెడ్డి ఆధ్వర్యంలో శనిగరం సర్పంచ్‌ పింగళి రవళిరంజిత్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ మేకల తిరుపతి, సీనియర్‌ నేత చెరిపెల్లి రాంచందర్‌తో పాటు స్థానిక నాయకులు మంత్రిని కలిశారు. తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను మంత్రి గంగులకు విన్నవించుకున్నారు. ఈటల సొంత మండలానికి చెందిన నేతలు. పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త కూడా రాజేందర్‌ వెంట లేరని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనిగరం, మరిపెల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి  తీసుకువచ్చారు.

ఈటల గూటికి జమ్మికుంట మున్సిపల్‌ పాలక సభ్యులు
ఇటీవల జమ్మికుంట మునిసిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు  కౌన్సిలర్లు సమావేశమై తాము పార్టీ వెంటే ఉంటామని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జమ్మికుంట మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌దేశిని స్వప్న కోటితో పాటు కౌన్సిలర్లు మేడిపల్లి రవీందర్, రావికంటి రాజు, పాతకాల రమేష్, దిడ్డరాము, ఎలగందుల స్వరూప, దేశిని రాధ, పొనగంటి రాము, సదానందం, సారంగం , పిట్టల శ్వేత, శ్రీపతి నరేష్, కుతాడి రాజయ్య తదితరులు సమావేశమై తామంతా ఈటల వెంటనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. అధికారులను బదిలీ చేసి, ప్రజా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న వారి ఆటలు సాగవన్నారు. 

మీ సమస్యలను నేను పరిష్కరిస్తా: గంగుల
హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ హామీ ఇచ్చారు, ఎవరూ అధైర్య పడవద్దని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, తాను హుజురాబాద్‌  ప్రజలకు  అందుబాటులో ఉంటానని, పార్టీ అ«ధిష్టానం  మనతోనే ఉన్నదని చెప్పారు.  

చదవండి:  EtelaRajender: గొర్రెల మంద మీద తోడేళ్ల దాడి ఇది
ఈటలపై ‘ఆపరేషన్‌ గంగుల’! 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు