చిరంజీవిపైనే పవన్‌ వ్యాఖ్యలా?

23 Aug, 2022 04:30 IST|Sakshi

జూ.ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను వాడుకునేందుకే అమిత్‌షా భేటీ 

మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు

గుడివాడ రూరల్‌: ప్యాకేజీల కోసం చంద్రబాబు దత్తపుత్రుడిగా మారి బూట్లు నాకే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మెగాస్టార్‌ చిరంజీవిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి సినీ రంగంలో సమస్యల పరిష్కారానికి, సినీ కళాకారుల సంక్షేమాన్ని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారని అన్నారు. చిరంజీవి సినీ రంగంలో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని, ఆయనంటే అందరికీ అమితమైన గౌరవమని తెలిపారు. చిరంజీవి సీఎంకు నమస్కారాలు పెట్టారని ఆత్మాభిమానం లేదని పవన్‌ అనడం సిగ్గు చేటన్నారు. ఉన్న పుత్రుడు వల్ల ప్రయోజనం లేక చంద్రబాబు దత్తపుత్రుడు వైపు చూస్తున్నారని విమర్శించారు.  

బీజేపీ విస్తరణలో భాగంగానే ఎన్టీఆర్‌తో భేటీ 
బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ అయ్యారని భావిస్తున్నట్లు కొడాలి నాని చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకోవడానికి అమిత్‌షా భేటీ అయ్యారంటే తాను నమ్మనని, బీజేపీ కోసం ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను  వాడుకునే ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగిందనేదే తన అభిప్రాయమన్నారు. రాజకీయంగా ఉపయోగం ఉండే వ్యక్తులతోనే మోదీ, అమిత్‌షా భేటీ అవుతారని చెప్పారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అధినేతలు ఢిల్లీలో మోదీ, అమిత్‌షా భేటీ కోసం ప్రదక్షిణలు చేసినా అపాయింట్‌మెంట్‌ దక్కలేదని ఎద్దేవా చేశారు.

రాజకీయంగా ఈ పకోడి, చకోడి నాయకుల సామర్థ్యం వారికి తెలుసునన్నారు. 2024 ఎన్నికల్లో బాబు, పవన్‌కు రాజకీయ సన్యాసం తప్పదని చెప్పారు. దొడ్డిదారిన మంత్రి పదవి పొందిన నారా లోకేష్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. హైదరాబాద్‌లో పుట్టి మంగళగిరిలో ఓడిపోయిన పప్పుగాడికి పలాసలో పనేంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడబడితే అక్కడ ఆందోళన చేస్తే పోలీసులు  అరెస్ట్‌ చేసి లోపలేస్తారన్నారు.  సీఎం జగన్‌ గురించి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే పప్పుగాడికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు