మహిళల్ని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం | Sakshi
Sakshi News home page

మహిళల్ని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Published Tue, Aug 23 2022 4:36 AM

Budi Mutyala Naidu on Womens welfare Andhra Pradesh - Sakshi

పిఠాపురం: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘చేయూత మహిళా మార్టు’లకు శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఏర్పాటు చేసిన ‘చేయూత మహిళా మార్టు’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు సమీపంలో ఉండేలా.. తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించే మార్టులు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెర్ప్‌ ఆధ్వర్యంలో మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులను పెద్ద వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి మార్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్థానికులంతా మహిళా మార్టును వినియోగించుకుని మహిళా సంఘాలకు తోడ్పాటునివ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే లక్షాధికారులుగా మారిన అక్కాచెల్లెమ్మలు.. ఈ మార్టుల ద్వారా కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

టీడీపీ హయాంలో లంచాలిస్తే గాని ప్రజలకు పథకాలు మంజూరు చేసేవారు కాదని.. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం 28,682 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.83.46 కోట్ల శ్రీనిధి రుణాలను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వి.వేణుగోపాలరావు, స్త్రీ నిధి ఎండీ నాంచారయ్య, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement