బాబుది నీచ బుద్ధి

7 Jan, 2021 06:05 IST|Sakshi

మంత్రి కొడాలి నాని ధ్వజం

గుడివాడ రూరల్‌: రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం గుంటాకోడూరులో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం, హోం మంత్రి, డీజీపీ, విజయనగరం జిల్లా ఎస్పీలు క్రిస్టియన్‌లు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. క్రిస్టియన్‌లు అయితే కేవలం క్రిస్టియన్‌ల కోసం, ముస్లింలు అయితే ముస్లింల కోసం, హిందువులు అయితే హిందువుల కోసమే పనిచేస్తారా.. అంటూ నిలదీశారు.

అన్ని వర్గాలూ ఓట్లేస్తేనే తాను సీఎం అయ్యానన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే రాజధానిని అమరావతిలో పెట్టి, తన సామాజికవర్గం వారితో వేలాది ఎకరాలు కొనుగోలు చేయించారని చెప్పారు. రాష్ట్రాన్ని తన సామాజికవర్గానికి దోచిపెట్టిన నీచుడు చంద్రబాబు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి, అలజడులు రేపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉన్నంత కాలం చంద్రబాబు ఆటలు సాగవన్నారు. సీఎంను లోకేశ్‌ హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్, పచ్చ మీడియాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు