Komatireddy Rajagopal Reddy: ప్రాణం పోయినా తప్పు చేయను

22 Aug, 2022 16:36 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు  సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ ఉప ఎన్నిక వ్యక్తి కోసం స్వార్థం కోసం రాలేదని.. తెలంగాణ భవిష్యత్‌ కోసం, రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవం వచ్చిందని తెలిపారు.

ఈ మేరకు నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు న్యాయం వైపే నిలుస్తారు. ధర్మాన్ని​ కాపాడతారు. ప్రాణం పోయినా తప్పు చేయను. నాపై అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ధర్మం వైపు ఉంటారని నమ్మకం ఉంది. నాపై ఆరోపణలు చేసేవారికి ఆధారాలు చూపాలని అడుగుతున్నా. సభకు వచ్చే వేలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ప్రాణంపోయినా ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయను
‘ఎంతోమంది నన్ను అమ్ముడుపోతుండు అంటున్నారు.. రాజీనామా ఎందుకు చేశానో, పార్టీ ఎందుకు మారానో మీకు తెలుసు, మీ అందరి ఆశీర్వాదం , నమ్మకం, విశ్వాసంతోనే రాజీనామా చేశాను’ అని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాణం పోయినా మునుగోడు ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయనని చెప్పారు.  తాను రాజీనామా చేస్తే ఫాం హౌజ్‌లో పండుకున్న కేసీఆర్‌ మునుగోడుకు వస్తాడని తాను ముందే చెప్పానని ఇప్పుడు అనుకున్నట్లుగానే కేసీఆర్‌ మునుగోడుకు వచ్చాడని తెలిపారు. మునుగోడులో ఇప్పుడు పెన్షన్‌లు వస్తున్నాయని, గట్టుప్పల్‌ మండలం వచ్చిందని వివరించారు.

తనకు పదవులు ముఖ్యంకాదని, స్వార్థం కోసం రాజీనామా చేసినవాడిని అయితే ఇంట్లోనే ఉండేవాణ్ని ఉప ఎన్నికలకు ఎందుకు వస్తానని ప్రశ్నించారు. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్‌, తెలంగాణ భవిష్యత్‌ కోసం పోరాడుతున్నానని చెప్పారు. బీజేపీ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితి కేసీఆర్‌ది అని విమర్శించారు. కేసీఆర్‌ మూటలు పంపితే ఆయన మనుషులు నాయకులను కొనుగోలు చేస్తున్నారని, కానీ, ప్రజలంతా తమవెంటే ఉన్నారని తెలిపారు. ఈడీ , సీబీఐ అంటూ మాట్లాడుతున్నాడని, తప్పు చేయనప్పుడు కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నాడని పేర్కొన్నారు. తప్పు చేశావ్‌ కాబట్టే భయపడుతున్నావ్‌ అని అన్నారు. 

చదవండి: (మునుగోడులో భారీ సభకు కాంగ్రెస్‌ ప్లాన్‌.. ప్రియాంక గాంధీ హాజరు!)

మరిన్ని వార్తలు