వంట గ్యాస్‌పై సబ్సిడీనా? నగదు బదిలీనా?

14 Nov, 2023 12:49 IST|Sakshi

హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట కలిగిస్తున్నా.. దాని చెల్లింపు మాత్రం ఎప్పటి మాదిరిగానే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా కానుందా? అంటే అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం చమురు సంస్థలు తమ అధీకృత డీలర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తున్న 14.5 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర బహిరంగ మార్కెట్‌ ప్రకారం రూ.955 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్‌ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్‌ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ. 40.71కు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమచేస్తోంది. తాజాగా ప్రధాన రాజకీయ పక్షాలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వంట గ్యాస్‌ ధర సగానికి సగం ధర తగ్గింపు ప్రకటించడం పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నప్పటికీ చెల్లింపు విధానంపై స్పష్టత లేకుండా పోయింది. మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండర్‌ రూ.400కు అందిస్తామని బీఆర్‌ఎస్‌, తాము అధికారంలోకి వస్తే సిలిండర్‌ రూ. 500 అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తమ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి.

వంట గ్యాస్‌ ధర ౖపైపెకి...
గత నాలుగేళ్లలో వంట గ్యాస్‌ ధర ఏకంగా 56 శాతం పెరిగింది. 2019లో రూ.706.50గా ఉండేది. ఆ తర్వాత 2020లో రూ.744కు పెంచారు. 2021లో రూ.809, 2022లో 949.50కి చేరింది. 2023 మార్చి నాటికి సిలిండర్‌ ధర రూ.1,155కి పెరిగింది. సరిగ్గా పదేళ్ల క్రితం సబ్సిడీపై రూ.414కు వంట గ్యాస్‌ ధర వచ్చేది. క్రమంగా ధర పై పైకి ఎగబాగింది. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపుచేయడంతో బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం సిలిండర్‌ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్‌ను మార్కెట్‌ ధర ప్రకారం రూ.697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65లను నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమయ్యేది. బహిరంగ మార్కెట్‌లో సిలిండర్‌ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా... సబ్సిడీ మాత్రం రూ.40.71కు పరిమితమైంది.

సబ్సిడీపైనే సరఫరా చేయాలి
గత పదేళ్ల క్రితం మాదిరిగా వంట గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ ధర పై మాత్రమే సరఫరా చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్‌ధర పై కాకుండా సబ్సిడీ ధర వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిలిండర్‌ధర తగ్గించి నగదు బదిలీ పద్ధతి వర్తింప జేస్తే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ధర చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేయడం తలకు మించిన భారం అవుతుందని పలు పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు