ఆ టైంలో రూల్స్‌ పక్కనపెట్టి పని చేశా: మంత్రి గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

10 Aug, 2022 21:07 IST|Sakshi

ముంబై: ‘‘నేను తరచూ అధికారులకు చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్‌ సర్‌’ అంటూ పని చేయాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానినే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మా ప్రకారమే పనిచేస్తుందని.. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ, ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం మాత్రం వేరే ఉంది. 

మంచి చేయాలనే ఆలోచనే ఉంటే.. పేదల సంక్షేమ విషయంలో ఏ చట్టం, అధికారం అడ్డుతగలబోదన్న కోణంలో గడ్కరీ పైవ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం రూల్స్‌, బ్యూరోక్రసీని పక్కనపెట్టి ఆయన చేసిన ఓ మంచి పనిని గుర్తు చేసుకున్నారాయన. అది 1995వ సంవత్సరం. ఆ సమయంలో మనోహర్‌ జోషి మహారాష్ట్ర ముఖ్యమం‍త్రిగా ఉన్నారు. గడ్కరీ ఏమో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మినిస్టర్‌గా పని చేశారు. విదర్భ మేల్ఘాట్  రీజియన్‌లో పోషకాహార లోపంతో పిల్లలు మరణించడం ఎక్కువగా ఉండేది. కనీసం 2వేల మంది పిల్లలైనా చనిపోయి ఉంటారక్కడ. 

ఆ సమయంలో ఆ ప్రాంతానికి రోడ్లు వేయాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. కానీ, అటవీ శాఖ అధికారులు చట్టాల వంకతో అడ్డుకునే యత్నం చేశారు. చివరకు అమరావతి కమిషనర్‌ సైతం ఎలాంటి సాయానికి ముందుకు రాలేదు. అది బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ టైంలో నా దారిలో సమస్యను పరిష్కరించా అని చెప్పుకొచ్చారాయన. ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు గడ్కరీ.

‘‘ఏ చట్టం పేదల సంక్షేమానికి అడ్డుకాదన్నది నాకు తెలుసు. అవసరమైతే సదరు చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదు. మహాత్మాగాంధీ అదే చెప్పారు’’ అని గడ్కరీ ఉటంకించారు. నాసిక్‌లో మంగళవారం మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

గడ్కరీ చూపిన చొరవతోనే మేల్ఘాట్ రీజియన్‌లో 450 గ్రామాలకు రోడ్లు పడ్డాయి. అక్కడి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయ్‌ కూడా.

ఇదీ చదవండి: ఆ బీజేపీ సీఎంకు పదవీగండం!

మరిన్ని వార్తలు