టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు.. ఎంపీకి తలనొప్పిగా మారిన మంత్రి!

4 Nov, 2022 15:16 IST|Sakshi

ఔను!. వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ పైగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా రాజకీయంగా రగిలిపోతున్నాట. ఇద్దరి మద్య ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. ఎవరా నేతలు... ఎందుకు వారి మధ్య కోల్డ్ వార్..

మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారపార్టీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. మంది ఎక్కువైతే పెరుగు పలుచనైనట్లు అంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నా ఆ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుందట.
చదవండి: ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్‌ కాల్‌.. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా సార్‌ అంటూ.. 


మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత

బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు. వారిని చూసిన వారెవ్వరైనా...వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గంతంగా యుద్ధమే సాగిస్తున్నారట. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని ఏకంగా మంతి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమకై కవిత ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూనే రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లోలోపల రగిలిపోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ తమ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట‌. 


డోర్నకల్‌ ఎమ్మెల్యే  రెడ్యానాయక్‌

మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో తెలుగుదేశం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకముందు తెలుగుదేశం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యానాయక్‌పై ఓటమిపాలయ్యారు. చివరకు టిఆర్ఎస్‌లో చేరగా చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్‌లో చేరాడంతో సత్యవతి రాథోడ్‌కు స్థానం లేకుండా పోయింది. 2018లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కే గులాబీ దళపతి టిక్కెట్ ఇచ్చి, సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు.‌ చిరకాల రాజకీయ ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది.


మంత్రి సత్యవతి రాథోడ్‌

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలు రాజకీయంగా పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. కవిత, రెడ్యానాయ‌క్ వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత త‌న‌కంటూ ప్ర‌త్యేకత‌ను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న మ‌హిళా నేత‌ల్లో ఎంపీ క‌వితకు చురుకైన నాయ‌కురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలు కవితకు తలనొప్పిగా మారాయి. అంతేకాదు కవిత కూడా మంత్రి సత్యవతి రాథోడ్ తో విభేదించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. 


మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌

డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా...మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరూ పోటీపడుతున్నారు. ఎంపీ కవిత పార్టీ అధ్యక్షురాలిగా మహబూబాబాద్‌ పరిమితం అయినా.. ఎంపీ పరిధి మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండడంతో ఆమె కూడా తరచూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక సత్యవతి రాథోడ్...మహబూబాబాద్తో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఇంచార్జీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇద్దరు మహిళా నేతలు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పుడు పరస్పర విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ, బహిరంగంగా ఎక్కడా బయటపడకున్నా, అంతర్గతంగా విభేదాలు పొడచూరినట్టు సమాచారం. పర్యటనలు, కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నా...ఎవరి కేడర్‌ను వారు ప్రోత్సహిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఆధిపత్యం కోసం అనుచరగణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలని ప్రచారం జరుగుతోంది.  రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ చిరకాల ప్రత్యర్థులు కావడం ఒకటైతే, మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీచేస్తారన్న చర్చసాగుతుంది.  డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపీ కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట.‌ అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్‌తో కవితకు విభేదాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో  మంత్రి సత్యవతి రాథోడ్‌కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. శంకర్ నాయక్‌తో కవితకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. పైకి అంతా కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న రాజకీయంగా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. 

మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. కానీ ఎక్కడా విభేదాలు ఉన్నట్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ చాప కింద నీరులా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీ క్యాడర్ తమ వైపు తిప్పుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. మానుకోటలో అధికారం పార్టీలో నాయకుల రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న గులాబీ దళపతి  రెండు కుటుంబాలు ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు చర్చించుకుంటున్నారు. మానుకోట గులాబీ గూటిలో ముసలం ఎటువైపు దారి తీస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు