ఎన్నికల ప్రచారానికి వీల్‌ చెయిర్‌లో వస్తా..!

12 Mar, 2021 03:05 IST|Sakshi
కోల్‌కతాలో ఆస్పత్రి బెడ్‌పై సీఎం మమతా బెనర్జీ

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా

శాంతి, సంయమనం పాటించండి

పార్టీ శ్రేణులకు మమత సందేశం

మమతపై దాడి వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తల నిరసన

ఈ దాడికి ఈసీదే బాధ్యతన్న తృణమూల్‌ నేతలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి వార్తతో పశ్చిమబెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ శ్రేణులు బుధవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఇది దాడి కాదు ప్రమాదం మాత్రమేనని, చిన్న ప్రమాదాన్నే పెద్దది చేసి చూపుతున్నారని బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. మరోవైపు, కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ సంయమనం పాటించాలని గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అవసరమైతే, వీల్‌చెయిర్‌లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తనపై దాడి చేశారన్న మమత ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై నందిగ్రామ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మమత ఆరోగ్యం స్థిరంగా ఉందని, రక్తంలో సోడియం స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. గాయమైన ఎడమ కాలికి కట్టు కట్టామని వివరించారు. ‘ముఖ్యమంత్రికి ఎడమ పాదం, ఎడమ మడమ వద్ద తీవ్రమైన గాయాలయ్యాయి. ఎడమ భుజం, మెడ వద్ద కూడా గాయాలున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ, గాయమైన కాలి వద్ద నొప్పి తీవ్రంగా ఉంది’ అని తెలిపారు. ఆమెను పరీక్షించిన వైద్య నిపుణులు సర్జరీ అవసరం లేదని తేల్చారన్నారు.

సీటీ స్కాన్‌ సహా మరికొన్ని వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారన్నారు. కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో, నార్త్‌ 24 పరగణ, హూగ్లీ, హౌరా, బీర్భూమ్, సౌత్‌ 24 పరగణ, జల్పాయిగురి తదితర ప్రాంతాల్లో గురువారం టీఎంసీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరిపాయి. బిరూలియా ప్రాంతంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగిందని, కాసేపటికే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు, శాంతి, సంయమనం పాటించాలని, ప్రజలు ఇబ్బంది పడే చర్యలకు పాల్పడవద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఒక వీడియో సందేశంలో మమత విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే మళ్లీ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, అవసరమైతే వీల్‌ చైర్‌ను వినియోగిస్తానని స్పష్టం చేశారు.  

దాడికి ఈసీనే బాధ్యత తీసుకోవాలి
మమతా బెనర్జీపై జరిగిన హత్యాయత్నానికి ఎన్నికల సంఘమే బాధ్యత తీసుకోవాలని టీఎంసీ డిమాండ్‌ చేసింది. సీఎంకు తగిన స్థాయిలో భద్రత కల్పించలేదని ఆరోపించింది. అది మామూలు దాడి కాదని, తమ నేత ప్రాణాలు తీసేందుకు ఉద్దేశించిన కుట్రపూరిత దాడి అని పేర్కొంది. కోల్‌కతాలో ఎన్నికల సంఘం అధికారులకు గురువారం టీఎంసీ నేతలు మమతపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు.  

సమగ్ర దర్యాప్తు జరగాలి
సీఎం మమతకు అయిన గాయాలపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే, మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది. మమత బెనర్జీపై జరిగింది దాడి కాదని, చిన్న ప్రమాదం మాత్రమేనని తమకు స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం అందిందని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్‌ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆమెకు అయిన గాయాలపై రాజకీయాలు చేయబోమని, అయితే, అది దాడి అని ఆమె ఆరోపిస్తున్నందున మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

అన్నీ నిందారోపణలే: ఈసీ
మమతపై దాడికి సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారిచ్చిన వినతిపత్రం పూర్తిగా నిందలు, ఆరోపణలతో నిండి ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు, విధులనే ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించింది. ఈ మేరకు టీఎంసీకి ఈసీ ఒక లేఖ పంపించింది.

మమత చరాస్తులు 16.72 లక్షలే
మమత బెనర్జీ మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు మాత్రమే. ఈ వివరాలను ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. తనకు సొంత వాహనం లేదని, తన పేరుపై ఆస్తులేవీ లేవన్నారు. 2019–20 ఏడాదికి తన ఆదాయం రూ. 10.34 లక్షలని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం రూ. 69,255 నగదు ఉందని, రూ. 13.53 లక్షల బ్యాంక్‌ బాలన్స్‌ ఉందని, రూ.18,490ల విలువైన నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ ఉన్నాయని చెప్పారు. రూ.43,837ల  విలువైన ఆభరణాలు ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు