బీసీలంటే టీడీపీకి ఎందుకంత ద్వేషం..?

1 Jun, 2022 16:02 IST|Sakshi

మహానాడులో నారా లోకేశ్‌ 

బీసీల మనోభావాలను గాయపరిచారు 

మంత్రి చెల్లుబోయిన వేణు

సాక్షి,సీటీఆర్‌ఐ (కాకినాడ): బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ద్వేషమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మంజీర కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ‘పేదల సంక్షేమ సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా పెద్ద పీట వేయడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మంత్రులు నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను అవహేళన చేసేలా నారా లోకేశ్‌ మాట్లాడారని, ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి వేణు అన్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహానాడును బూతుల వేదికగా మార్చారన్నారు. ఎంత ఎక్కువగా తిడితే అంత చంద్రబాబు దృష్టిలో పడవచ్చని ఆ పార్టీ నాయకులు భావించారన్నారు. నారా లోకేశ్‌ ఒక అడుగు ముందుకేసి సామాజిక న్యాయభేరిలో పాల్గొన్న బీసీలను అవహేళన చేసేలా మాట్లాడటం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే బీసీలకు మంత్రి పదవులు, నామినేటేడ్‌ పోస్టులు దక్కాయని చెప్పారు. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం లోకేశ్‌కు ఇష్టం లేదన్నారు. టీడీపీకి ఏనాడో బీసీలు దూరం అయ్యారని మంత్రి అన్నారు.

చదవండి: Complaint Against Nara Lokesh: నారా లోకేశ్‌కు బిగ్‌ షాక్‌.. పోలీసులను ఆశ్రయించిన మాజీ టీడీపీ నేత

మరిన్ని వార్తలు