మా మంచి పనులు ఎందుకు కన్పించవు?

29 Jun, 2023 02:52 IST|Sakshi

గవర్నర్‌కు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న 

తమిళిసై బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శ 

ఉస్మానియా ఆస్పత్రిపై వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మంత్రి 

ఆ భవనం ఆస్పత్రికి పనికిరాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు వెల్లడి 

కోర్టు క్లియరెన్స్‌ రాగానే నిర్ణయం తీసుకుంటామన్న హరీశ్‌  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అధికార ప్రతినిధిలాగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌ కోఠి లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్‌ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం. భవన నిర్మాణంపై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కేసీఆరే. 2015 జూలైలో సీఎం ఆసుపత్రిని సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారు.

అయితే ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అందువల్ల అది ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు, పురావస్తు శాఖ డైరెక్టర్‌తో ప్రభుత్వం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కోర్టుకు ఇదే విషయం చెప్పింది. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. అది రాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.

గవర్నర్‌ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న మంచి పనులు గవర్నర్‌కి కని పించవా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాం.. అది గవర్నర్‌కి కనిపించదు. ‘‘మంచి కనబడదు.. మంచి వినబడదు.. మంచి చూడం’’అన్నట్టుగా గవర్నర్‌ తీరు ఉంది..’అని హరీశ్‌రావు విమర్శించారు. 

చెడు మాత్రమే చూస్తామంటే ఎలా? 
‘గవర్నర్‌ తీరులో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైద్యురాలిగా గవర్నర్‌ వైద్య ఆరోగ్యశాఖ కష్టాన్ని గుర్తించడం లేదు. 2014తో పోల్చితే పరిస్థితి మారింది. నీతి ఆయోగ్‌ నివేదికలో వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నిమ్స్‌లో పడకల సంఖ్యను 1,500కు పెంచాం. కొత్తగా 2,000 పడకలతో విస్తరిస్తున్నాం. కేసీఆర్‌ కిట్, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను తగ్గించాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం.

దేశంలో 100 శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. కంటి వెలుగు చాలా బాగా చేశాం. ఇవేవీ గవర్నర్‌ గుర్తించరు. ప్రశంసించడానికి మనసు రాదు. అభినందిస్తూ కనీసం ఒక ట్వీట్‌ కూడా చేయరు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్‌ దవాఖానకు అనే స్థాయికి చేర్చాం. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. డయాలసిస్‌ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచాం.

గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారు. బస్తీ దవాఖానాలను కూడా నీతి అయోగ్‌ ప్రశంసించింది. ఇవేమీ గవర్నర్‌కు ఎందుకు కనిపించండలేదు? ఎందుకు అభినందించరు? ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్‌గానైనా గవర్నర్‌ అభినందించాలి కదా? వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అలా కాకుండా చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం అన్నట్టుగా వ్యవహరించడం గవర్నర్‌కు తగదు. బీజేపీలా రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు