మన ఊరు.. తడ‘బడి’! | Sakshi
Sakshi News home page

మన ఊరు.. తడ‘బడి’!

Published Thu, Jun 29 2023 2:48 AM

Specialists who require special attention on primary education - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ప్రాథమిక విద్య అనేది హక్కు మాత్రమే కాదు. పేదల జీవితాల్లో చీకటిని శాశ్వతంగా తొలగించే ఏకైక సాధనం. సమాజ ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన చోదకం కూడా. అందువల్ల ప్రాథమిక దశలో మంచి అభ్యాసన కోసం చక్కటి పాఠశాల వాతావరణం, అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ‘మన ఊరు – మనబడి’కి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోని 26,195 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.7,289 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించింది. కానీ ఈ పథకం తొలి ఏడాదిలోనే తడబడుతోంది. నిధుల కొరతతో వెనకబడి పోతోంది. మూడు దశల్లో మొత్తం అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిదశ కింద 9,058 పాఠశాలలను ఎంపిక చేయగా, జూన్‌ 12తో గడువు ముగిసినా 7 వేలకు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో పనులు సుదీర్ఘంగా సాగుతుండగా, అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద, శిథిల భవనాల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. 

అన్ని హంగులతో ఆకర్షణీయంగా..
మంచినీళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఫర్నిచర్, కిచెన్‌ షెడ్లు, డైనింగ్‌ హాళ్ల ఏర్పాటుతో పాటు కొత్త క్లాస్‌రూంల నిర్మాణం, డిజిటల్‌ బోర్డు లు, పాఠశాల అంతా ఆకర్షణీయ మైన రంగులు లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించడమే కాకుండా పూర్వ విద్యార్థులు, కార్పొరేట్‌ సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.

కోటి రూపాయలకు పైబడి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక గదికి వారు సూచించే పేరును పెట్టాలని నిర్ణయించారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. కానీ దాతల నుండి ఆశించిన స్పందన లేకపోవటం, ప్రభుత్వం నుండి నిధులు ఆగిపోవటంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి (టి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మనబడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి.  పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను ఉపాధ్యాయులు ఆవరణలోని చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు.

ఇదీ లెక్క..
2025 నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి, 2030 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలన్నది లక్ష్యం. కానీ ఇప్పు డు రాష్ట్ర సగటు అక్షరాస్యత 73.3 శాతమే. ఇక మహిళల్లో అక్షరాస్యత 64.8 శాతమే. 
 రాష్ట్రంలో మొత్తం 62.29 లక్షల మంది విద్యార్థులుండగా అందులో అత్యధికం ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. 50.23 శాతం ప్రైవేటులో, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు.
   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 49.5% వెనకబడిన తరగతులు (బీసీ), 22.4% జనరల్‌ కేటగిరి, 17.5 శాతం ఎస్సీలు, 10.6 శాతం గిరిజనులు ఉన్నారు. 
 ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి.

తక్కువ నిధులిస్తోంది మన రాష్ట్రమే
రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 (ఎ) మేరకు విద్య అనేది ప్రాథమిక హక్కు. 6 నుండి 12 ఏళ్ల వరకు తప్పనిసరి విద్య అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ తెలంగాణలో విద్య అప్రాదాన్య సబ్జెక్ట్‌ అయింది. దీంతో పేదలు, వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోంది. దేశంలో విద్యకు అతి తక్కువగా నిధులు కేటాయిస్తున్న సర్కార్‌ మనదే. విద్య విషయంలో ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వం పెరగాలి.      – జస్టిస్‌ చంద్రకుమార్‌

ఆశించిన స్థాయిలో లేదు.. 
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రత్యేక పద్ధతుల్లో, తగిన మౌలిక సదుపాయాలతో విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్‌ శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్‌

Advertisement
Advertisement