దళితబంధు సర్వే..భేష్‌ 

8 Sep, 2021 04:30 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

అధికారులకు మంత్రులు హరీశ్, కొప్పుల, గంగుల అభినందనలు 

12,521 లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ 

త్వరలోనే మిగిలినవారికీ జమచేయాలని అధికారులకు ఆదేశం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు  మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్‌ఫోన్‌లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్‌ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు.

దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్‌ ఇట్‌ అప్‌’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు.  

త్వరలోనే మిగిలిన వారికి..! 
దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్‌ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్‌ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్‌ వై.సునీల్‌ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌ లాల్‌ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు