MLA Rajagopal Reddy: భట్టీతో భేటీ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

25 Jul, 2022 18:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్‌ కాంగ్రెస్‌ లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో భేటీ తర్వాత రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సొంతపార్టీపై చురకలంటించారు.

కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరని విమర్శించారు. చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని అన్నారు. సినిమా డైలాగులకు ఓట్లు రావని స్పష్టం చేశారు. భట్టి తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు. 

‘సీఎల్పీ ఇవ్వాలని నేను కూడా అడిగా. నాకు ఇవ్వకుంటే సీఎల్పీ నాయకుడిగా భట్టికి ఇవ్వాలని అధిష్టానానికి చెప్పాను. పీసీసీ అధ్యక్షుడి మార్పు కూడా తొందరగా చేయలేదు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదని చెప్పాను.  రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది నిజం. బీజేపీ బలపడుతోందని నేను పలుమార్లు చెప్పాను. చెప్పిందే నిజమైంది. ఈటలకు బీజేపీ తోడైంది. అందుకే గెలిచారు. నేను కన్ఫ్యూజ్‌ కాలేదు.. క్లారిటీతో చెప్పా. బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడిస్తుందని నమ్ముతున్నా. మునుగోడుకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే.. నేను ఒక్కసారి వెళ్లినా ఒక్కటే.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా’ అని ప్రశ్నించారు.

మాది కాంగ్రెస్‌ కుటుంబం
తమది కాంగ్రెస్‌ కుటుంబమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో సమావేశమనంతరం మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్‌ అంటే రాజగోపాల్‌ రెడ్డికి గౌరవం ఉందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారని తాను అనుకోవడం లేదని అన్నారు. తొందర పడవద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్సేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: తెలంగాణలో అప్పులే తప్ప అభివృద్ధి కనిపించడం లేదు: ఉత్తమ్‌

మరిన్ని వార్తలు