చచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా..

14 Oct, 2022 01:30 IST|Sakshi

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మెరుగైన విద్య, వైద్యంపై జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలి

గుండాల: సీఎం పదవిపై తాను ఏనాడూ ఆశ పెట్టుకోలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ‘30 ఏళ్లుగా పార్టీ కోసం నీతి, నిజాయితీగా పనిచేస్తున్నా. చచ్చేవరకు పార్టీలోనే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన సమయంలో సోనియాని కలిసి కాంగ్రెస్‌లో కొనసాగుతానని చెప్పానన్నారు. ధనికరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను రూ.4 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్‌ కుటుంబం బాగుపడిందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆయన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కోలుకొండ యాదగిరికి కాంగ్రెస్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప కేసీఆర్‌ ప్రభుత్వంలో పేదవాడి ఇంటి కల నెరవేరలేదన్నారు.

కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం శ్మశానవాటికలు, ప్రభుత్వభవనాలు నిర్మిస్తూ గులాబీ రంగులు వేసుకోవడమేమిటని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న వాసాలమర్రిలో కనీసవసతులు కూడా లేవని పేర్కొన్నారు. ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందిస్తున్న సీఎం జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలన్నారు. వైఎస్సార్‌ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంతోనే పేదలకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. 

మరిన్ని వార్తలు