పదేళ్లైనా.. ప్చ్‌! జనసేన అనుకూల పవనాలు ఇంకా రాలేదు

13 Mar, 2023 11:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా పార్టీకి అనుకూల పవనాలు ఇంకా రాలేదని పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. కాపులందరూ ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకలో తాను ఓడిపోయేవాడిని కాదన్నారు. ‘రాష్ట్రంలో ఇంత సంఖ్యా బలం ఉన్న కాపు, బలిజ కులాలకు నిజంగా కట్టుబాటు ఉంటే వేరేవారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది గ్రహించనంత వరకు రాజ్యాధికారాన్ని  మరిచిపోండి’ అని పేర్కొన్నారు.

ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి బీసీలు, ఎస్సీలను కూడగట్టి కమ్మ, రెడ్డి, క్షత్రియులకు గౌరవం ఇచ్చి తీరాలన్నారు. ‘మా అమ్మ గాజుల బలిజ, నాన్న కాపు. నా కులం ఉనికిని నేను ఎప్పుడూ తీసివేయలేదు. నా కులం వాస్తవం. కాపులు ఐక్యంగా ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తిగా ఎదగవచ్చు’ అని పేర్కొన్నారు. కాపులు కోస్తాలో గొంతు ఎత్తగలరుగానీ రాయలసీమలో బలిజలు నోరెత్తేందుకు భయపడతారని, ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు.

సీఎం పదవిస్తేనే పొత్తు!
ముఖ్యమంత్రి పదవి ప్రాతిపదికనే ఏ పారీ్టతోనైనా పొత్తులు ఉండాలని కాపు సంక్షేమ సేన పవన్‌ కళ్యాణ్‌కు సూచించింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ జనసేనను బలహీన పరిచేందుకు టీడీపీ పలు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెండింటితో యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాలని తాను పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నట్లు చెప్పారు. లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోనని మాటిస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొంటూ తానెందుకు ఉంటానని ప్రశి్నంచారు. ‘నమ్మిన వారిని తగ్గించం. ఎవరి అజెండాల కోసమూ పనిచేయం’ అని తెలిపారు.
చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే 

మరిన్ని వార్తలు