బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం: ఆర్‌ఎస్పీ

21 Mar, 2022 02:32 IST|Sakshi

నూతనకల్, అర్వపల్లి: ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని దూరం చేసి బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల పరిధిలోని వెంకెపల్లి, చిల్ప కుంట్ల, నూతనకల్, యడవెళ్లి, తాళ్లసింగారం గ్రామాల్లో నిర్వహించిన రాజ్యాధికార యాత్రలో ఆయన వివిధ చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అనంతరం అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది బీఎస్పీలో చేరారు.

ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు అధికారం ఉండటం వల్ల ఆ వర్గాలకే ప్రయోజనాలు చేకూరాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంతకాలం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామ నడం ఆ యన రాజకీయ ప్రయోజనాలకోసమేనని అన్నారు. జీఓ 111ను రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ వాటి నిర్మాణాలను గాలికి వదిలేశారని, కొన్ని ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పిల్లర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు.  

మరిన్ని వార్తలు