‘రాజీనామా చేయమన్నారు.. బాధగా ఉంది’

7 Jul, 2021 17:02 IST|Sakshi

రాజీనామాపై స్పందించిన బాబుల్‌ సుప్రియో

కోల్‌కతా: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బాబుల్ సుప్రియో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాబుల్‌ సుప్రియోతో పాటు మరో 14 మంది మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామాపై స్పందిస్తూ.. బాబుల్‌ సుప్రియో ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. తాను రాజీనామా చేశానని.. ఇన్నాళ్లు తనకు మంత్రిగా పని చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేశారు. 

ఈ సందర్భంగా బాబుల్‌ సుప్రియో తన ఫేస్‌బుక్‌లో ‘‘అవును.. పొగ ఉందంటే.. తప్పకుండా ఎక్కడో ఓ చోట మంట ఉన్నట్లే.. విషయం తెలిసిన దగ్గర నుంచి నా మీడియా మిత్రులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.. కానీ అందరితో మాట్లాడటానికి కుదరడం లేదు. అవును మంత్రుల మండలికి నేను రాజీనామా చేశాను. నేను ముందు చెప్పినట్లుగానే.. నన్ను రాజీనామా చేయమని కోరారు.. చేశాను. మంత్రుల మండలిలో సభ్యుడిగా ఉండి.. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

‘‘ఈ రోజు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. అందుకే వారు 2019లో అత్యధిక మెజారిటీతో తిరిగి నన్ను గెలిపించారు. బెంగాల్‌ నుంచి మంత్రులగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నా సహచరుల పేర్లు ప్రస్తుతం నేను బయటకు చెప్పలేను.. కానీ వారి గురించి అందరికి తెలుసు. వారందరికి నా అభినందనలు. రాజీనామా విషయంలో నేను బాధపడుతున్నాను.. కానీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పట్ల చాలా సంతోషిస్తున్నాను’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని అనూహ్యంగా పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 15 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. డాక్టర్ హర్షవర్ధన్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ చౌబే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, బబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే శాసన సభ ఎన్నికలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు