తెలంగాణ నుంచి సోనియా పోటీ | Sakshi
Sakshi News home page

తెలంగాణ నుంచి సోనియా పోటీ

Published Tue, Dec 19 2023 1:29 AM

Sonia Gandhi To Contest From Telangana In Parliament Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది.

సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు.  

రేపట్నుంచి శ్వేతపత్రాలు 
కాంగ్రెస్‌ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్‌ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్‌ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. 

లోక్‌సభ టార్గెట్‌ 15 
వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్‌సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.  

సంక్రాంతి లోపే పదవులు 
పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్‌ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్‌ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం.  

ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు 
ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్‌ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్‌ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్‌ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.  

బూత్‌ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి 
ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ జి.నిరంజన్‌ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్‌ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్‌ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జులు ఖరారు 
పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్‌ నేతలు జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలకు కూడా ఇన్‌చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్‌సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి.  

ఇన్‌చార్జులు వీరే: 
చేవెళ్ల, మహబూబ్‌నగర్‌    – రేవంత్‌రెడ్డి 
సికింద్రాబాద్, హైదరాబాద్‌– భట్టి విక్రమార్క 
మెదక్‌    – దామోదర రాజనర్సింహ 
ఆదిలాబాద్‌     – సీతక్క 
నల్లగొండ    – ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
భువనగిరి    – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
వరంగల్‌    – కొండా సురేఖ 
ఖమ్మం, మహబూబాబాద్‌ – పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి 
పెద్దపల్లి    – శ్రీధర్‌బాబు 
కరీంనగర్‌    – పొన్నం ప్రభాకర్‌ 
నిజామాబాద్‌    – టి.జీవన్‌రెడ్డి 
జహీరాబాద్‌    – పి.సుదర్శన్‌రెడ్డి 
మల్కాజిగిరి    – తుమ్మల నాగేశ్వరరావు 
నాగర్‌కర్నూల్‌    – జూపల్లి కృష్ణారావు 

ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ 
ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్‌ షబ్బీర్‌ అలీ వెల్లడించారు. గాం«దీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్‌కుమార్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు.

28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement