రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ యాత్ర.. భట్టి, రేవంత్‌లిద్దరా? లేదా ఒ‍క్కరేనా?

26 Nov, 2022 08:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ ఇచ్చిన రెండు ప్రతిపాదనలపై సమాలోచనలు చేస్తున్న ఏఐసీసీ యాత్ర చేసేందుకు మాత్రం సూత్రప్రాయంగా అనుమతినిచ్చింది. అయితే, బస్సుయాత్ర చేయాలా లేక పాదయాత్ర చేయాలా? ఈ రెండూ చేయాలా... పాదయాత్ర చేస్తే ఎవరెవరు చేయాలి అన్న వాటిపై మీమాంస కొనసాగుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్‌ ఆఖరులో కాంగ్రెస్‌కు సంబంధించిన ఏదో ఒక యాత్ర రాష్ట్రంలో ప్రారంభం కానుంది. బస్సుయాత్ర ఖరారైతే దాదాపు 10 మంది నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సులో పర్యటించి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలందరూ ఐక్యంగా ఉన్నామనే సంకేతాలివ్వనున్నారు. ఈ బస్సు యాత్ర ముగిసిన తర్వాత మార్చి నుంచి పాదయాత్ర ప్రారంభించాలనే ప్రతిపాదన ఉంది. అయితే, బస్సు యాత్ర ఉండకపోవచ్చని, డిసెంబర్‌ నెలలోనే పాదయాత్ర నిర్వహించవచ్చనే చర్చ కూడా జరుగుతోంది.

భట్టి–రేవంత్‌... ఇద్దరూ..!
పాదయాత్ర ఎవరు చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కలిసి ఒకచోట, విడివిడిగా మరో చోట యాత్ర చేయనున్నారు.

ఇదే కోణంలో తెలంగాణలోనూ ఈ ఇద్దరిలో ఎవరు యాత్ర చేయాలి? విడివిడిగా ఇద్దరూ చేయాలా? లేక ఇద్దరూ కలిసి చేయాలా అన్నదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఇద్దరూ కలిసి చేయాలని కొందరు అంటుంటే, భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను రేవంత్‌ చూసుకోవచ్చని మరికొందరు, రేవంత్‌ కచ్చితంగా పాదయాత్ర చేయాలని ఇంకొందరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏఐసీసీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పాదయాతక్రు భట్టి రెడీ
సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇప్పటికే పాదయాత్రకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. భద్రాచలం నుంచి ప్రారంభమై పినపాక, ములుగు, భూపాలపల్లి, మంథని, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా ఆలేరు నుంచి హైదరాబాద్‌ వరకు యాత్ర చేసేందుకు ఆయన రూట్‌ మ్యాప్‌ కూడా తయారు చేసుకుని అధిష్టానానికి సమాచారమిచ్చారు. ఈ రూట్‌మ్యాప్‌ ఖరారవుతుందా? మార్పు జరుగుతుందా? ఎవరు పాదయాత్ర చేస్తారన్నది మాత్రం మరో పది రోజుల్లో తేలనుంది.

టీపీసీసీ జట్టు కూర్పుపై కసరత్తు
ఇక, టీపీసీసీ జట్టు కూర్పుపై కూడా ఏఐసీసీ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జులతో కలిసి దీనిపై గత మూడు రోజులుగా ఢిల్లీలో చర్చించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నట్టు సమాచారం. పూర్తిస్థాయి కమిటీలను ఈ నెలాఖరుకల్లా ప్రకటిస్తారు, ఆలస్యమయితే డిసెంబర్‌ మొదటి వారంలో కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు. పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం ప్రకటన అనతంరం కార్యవర్గ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నిర్వహించాల్సిన యాత్రలపై తీర్మానం చేయనున్నారు.
చదవండి: ‘ముందస్తు’ ప్రచారం.. కమలం అప్రమత్తం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు