Huzurabad Bypoll 2021:పెంచేటోళ్లు వాళ్లు.. పంచేటోళ్లం మేము

10 Oct, 2021 01:44 IST|Sakshi
అబ్దుల్‌ టీస్టాల్‌లో టీ తాగుతున్న హరీశ్‌రావు 

రైతులను ఉగ్రవాదులతో పోల్చిన పార్టీ బీజేపీ: హరీశ్‌రావు

ధరలు పెంచుతున్న బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి

ఇల్లందకుంట/హుజూరాబాద్‌/ఎల్కతుర్తి: ‘బీజేపీ వాళ్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు పెంచారు. నలుగురికి ఉపయోగపడేలా పంచేది టీఆర్‌ఎస్‌ పార్టీ. ప్రజలు ధరలు పెంచేటోళ్ల వైపు ఉంటారా.. లేక పంచేటోళ్ల వైపు ఉంటారా.. ఆలోచించుకొని ఓటు వేయాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, బూజునూర్, లక్ష్మాజిపల్లి, పాతర్లపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు రోడ్డెక్కితే కార్లు ఎక్కించి చంపుతున్నది బీజేపీ కాదా..? డీజీల్‌ ధరలు పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ కాదా..? అని ప్రశ్నిం చారు. రైతులను ఉగ్రవాదులుగా పోల్చుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ అని ధ్వజమెత్తారు. రెండున్నర ఏళ్లుగా ఇక్కడి ఎంపీ సం జయ్‌ ప్రజలకు ఏమైనా ఖర్చు చేశారా అని నిలదీశారు. కాగా,  ‘అబ్దుల్‌ భాయ్‌.. కైసే హో అంటూ హరీశ్‌రావు హుజూరాబాద్‌లోని చాయ్‌ హోటల్‌ యజమాని అబ్దుల్‌ను పలకరించారు.

అతని టీస్టాల్‌లో చాయ్‌ తాగుతున్న హరీశ్‌రావును చూసి ఆ పక్కనే ఉన్న ఓ సోడా బండి వ్యాపారి వెంటనే బట్టల షాప్‌కి వెళ్లి శాలువా తెచ్చి మంత్రిని సన్మానించాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో ఆరేకుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. 

మరిన్ని వార్తలు