బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ

17 Oct, 2021 03:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు   

బీజేపీని ఈటల ఓన్‌ చేసుకోవడం లేదు: హరీశ్‌రావు

హుజూరాబాద్‌: బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి ఉంటుందని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు గులాంగిరీ చేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరలో నిజంగా రాష్ట్ర పన్ను రూ.291 ఉందా? ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా అన్నారు. సిలిండర్‌పై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ ధర పెంచిందని విమర్శించారు.

మద్యం, మాంసం పంచామని, రూ.20 వేలు ఇస్తున్నామని ప్రజలను రాజేందర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆరుసార్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. గ్రైండర్లు, గడియారాలు, కుట్టుమిషిన్లు పంచింది ఎవరు’ అని హరీశ్‌ ప్రశ్నించారు. ఈటల ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీని మీరు ఓన్‌ చేసుకోవడం లేదు. మిమ్నల్ని బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదు. ఎక్కడా జై భారత్‌మాత అనడం లేదు. జై శ్రీరాం అనడంలేదు’ అని విమర్శించారు.

సింగరేణి బొగ్గును మన రాష్ట్రం నుంచి తరలించే కుట్ర జరుగుతోందని.. బొగ్గు లేకుండా కుట్ర చేసినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని నిలదీశారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు