ఎంపీ అర్వింద్‌ భాష మార్చుకోవాలి 

20 Nov, 2022 02:17 IST|Sakshi

పార్టీల మధ్య గొడవను మున్నూరుకాపులపై దాడిగా చూపొద్దు 

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ధర్మపురి అర్వింద్‌ ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఘోరమైన పదజాలం ఉపయోగిస్తున్నారని, భాష మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. ఖమ్మంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అర్వింద్‌ వంటి వారు ఇలాంటి భాషను ఉపయోగించడం సరికాదన్నారు.  

బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వివాదాన్ని మున్నూరుకాపులపై జరిగిన దాడిగా కొందరు సామాజిక మాధ్యమాల్లో అభివర్ణిస్తున్నారని... ఇది రెండు పార్టీల మధ్య గొడవే తప్ప, కులపరమైన దాడిగా భావించవద్దని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడి హోదాలో కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ మాదిరి అభివృద్ధి లేదని, అందుకే ఆ పార్టీ నేతలు ఓర్వలేక సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయని వద్దిరాజు ఆరోపించారు.   

మరిన్ని వార్తలు