JP Nadda In Hyderabad: ర్యాలీ లేకుండానే నిరసనలతో ముగించిన బీజేపీ

4 Jan, 2022 20:16 IST|Sakshi

Live Updates:

Time: 8:14 PM
తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. ‘‘మాది క్రమశిక్షణ గల పార్టీ. కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపాం. నన్ను ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు చెప్పారు. నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పాను. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని జేపీ నడ్డా మండిపడ్డారు.

Time: 7:21 PM
సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జేపీ నడ్డా.. అనంతరం ర్యాలీ లేకుండానే నిరసనలతో కార్యక్రమాన్ని ముగించారు. కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడనున్నారు.

Time: 7:09 PM
సత్యాగ్రహం పూర్తయింది.. ర్యాలీ లేదు: కిషన్‌రెడ్డి
సత్యాగ్రహం పూర్తయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా ర్యాలీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ప్రాంతాలకు వాళ్లు వెళ్లాలని కిషన్‌రెడ్డి సూచించారు. బండి సంజయ్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని తరుణ్‌చుగ్‌ డిమాండ్‌ చేశారు.

Time: 6:53 PM
సికింద్రాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా.. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నల్ల కండువాలు, నల్ల మాస్కులతో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సికింద్రాబాద్‌లో భారీగా పోలీసుల మోహరించారు.

Time: 6 PM

ర్యాలీకి అనుమతి లేదు: సీవీ ఆనంద్‌
జేపీ నడ్డా రాకతో హైదరాబాద్‌లో పోలిటికల్‌ హీట్‌ పెరిగింది. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో జేపీ నడ్డా తలపెట్టిన క్యాండిల్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే... అంతకు ముందు ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ క్లారీటీ ఇచ్చారు. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో  జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య పద్దతిలోనే నిరసన తెలుపుతాం: జేపీ నడ్డా
మీడియాతో జేపీ నడ్డా మాట్లాడుతూ, తనను జాయింట్‌ సీపీ కలిశారని.. తెలంగాణలో ర్యాలీలు నిషేధిస్తూ జీవో ఉందని చెప్పారన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తామని.. ప్రజాస్వామ్య పద్దతిలోనే నిరసన తెలుపుతామని నడ్డా పేర్కొన్నారు. బాధ్యత గల పౌరుడిగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తానని తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపించిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ పర్యటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. బండి సంజయ్‌ అరెస్టుకు సంబంధించి తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై జేపీ నడ్డా తీవ్ర అభ్యంతరం తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందని మండిపడ్డారు.

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఆయన హైదరాబాద్‌లోని ఎంజీ రోడ్డులో మంగళవారం సాయంత్రం క్యాండిల్‌ ర్యాలీ తలపెట్టారు. ఈ ర్యాలీకి నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. జేపీ నడ్డాను కలిసిన పోలీసులు.. కోవిడ్‌ ఆంక్షల జీవోను చూపించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ర్యాలీ జరగనున్న ఎంజీ రోడ్డులో భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు