భారత్ జోడో యాత్ర కశ్మీర్‌ చేరే నాటికి దేశంలో కాంగ్రెస్ ఉండదు

27 Sep, 2022 12:15 IST|Sakshi

దిస్పూర్‌: భారత్ జోడో యాత్రపై సెటైర్లు వేశారు బీజేపీ నేత, అసోం మంత్రి పీజూష్ హజారికా. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్ చేరేలోపు కాంగ్రెస్ కనుమరుగవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా దేశం అవతరిస్తుందని వ్యాఖ్యానించారు.

అసోం ధుబ్రీ జిల్లాలోని రాజీవ్ భవన్‌లో కాంగ్రెస్ సోమవారం సమావేశం నిర్వహించింది. రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర నవంబర్‌1న రాష్ట్రంలోకి చేరుతున్న సందర్భంగా దీన్ని విజయవంతం చేసే విషయంపై చర్చ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు పీజూష్. చూడబోతే కాంగ్రెస్ దేశంలో కనుమరుగయ్యేలా ఉందని పంచులు వేశారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు లాంటిది ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తప్పుదోవ పట్టించవద్దని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్‌లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.

అయితే ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై చర్చిందేందుకు ఇది సరైన సమయం కాదని పార్టీ నాయకులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర 150 రోజుల పాటు సాగనుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,500 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు.
చదవండి: పీఎఫ్‌ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు

మరిన్ని వార్తలు