మేం తలుచుకుంటే మీరుంటారా.. మీ పార్టీ ఆఫీసులు ఉంటాయా: టీఆర్‌ఎస్‌ వార్నింగ్‌

23 Aug, 2022 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేతల నిరసనలు, ఆందోళనలు పీక్స్‌ చేరుకున్నాయి. ఈ క్రమంలో దీక్షకు దిగిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు జనగామలో అరెస్ట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో బీజేపీ నేతల ఆరోపణలు, ఆందోళనలపై టీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. హైదరాబాద్‌లోని  టీఆర్‌ఎస్‌ఎల్వీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ-ఐటీ కేసు వివరాలు బీజేపీ వాళ్లకు ముందే ఎలా తెలుస్తాయి. మా బతుకమ్మ జోలికి వస్తే, మీ బతుకులు ఆగం అయిపోతాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసి, రౌడీయిజం చేస్తారా?. రౌడీయిజం కాకుండా మళ్లీ దీక్షలు, నిరసనలా? అని ప్రశ్నించారు.  ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు కీలు బొమ్మలుగా మారాయి. కార్పొరేట్లు అంబానీ, అదానీ చేతిలో మోదీ కీలుబొమ్మగా మారిపోయారు. దర్యాప్తు సంస్థలు ఎవరి మీదనైనా దాడులు చేయాలంటే.. వారు మోదీకి వ్యతిరేకులైనా అయి ఉండాలి.. లేదా బీజేపీలో చేరనివారైనా అయి ఉండాలన్నారు. 

మరోవైపు.. కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన 26 మంది బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, కవిత ఇంటి వద్ద ఆందోళనల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు.. ఆమె ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దాడులు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ మంత్రులు, కార్యకర్తలు, వేలాది మంది సైన్యం మీలాగే ఆలోచిస్తే.. మీరు(బీజేపీ నేతలు) మిగులుతారా?. మీ పార్టీ ఆఫీసులు, ఇళ్లు ఉంటాయా అని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌కు కేంద్రం నుంచి ఫోన్‌కాల్‌

మరిన్ని వార్తలు