దేశ సరిహద్దుల్లో పనిచేసిన వ్యక్తిని.. 

9 Feb, 2021 00:19 IST|Sakshi

అవినీతికి పాల్పడాల్సిన అవసరం నాకు లేదు  

బండి సంజయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఉత్తమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తాను దేశ సరిహద్దులో పనిచేసిన వ్యక్తినని, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదని పీసీసీ అధినేత ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎవరి అండతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో తేల్చాలని, ఇప్పటికైనా ప్రభుత్వం ల్యాండ్‌ మాఫియాను అరికట్టాలని కోరారు. సోమవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్‌ స్థాయి వ్యక్తి ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ను చూస్తే అర్థమవుతుందని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. తననుద్దేశించి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

సీఎం కేసీఆర్‌ అవినీతిపరుడని అంటున్న బీజేపీ నేతలు.. ఆయనపై సీబీఐ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదని  ప్రశ్నించారు. ‘నేను హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎక్కడా భూములు కబ్జాకు గురికాలేదు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే అక్కడ వేలాది ఎకరాల భూములు కబ్జాల పాలవుతున్నాయి’అని ఆరోపిం చారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేతో కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వేల ఎకరాలు కబ్జాలు చేస్తున్నారని, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్‌ అండదండలు ఎమ్మెల్యేకు ఉన్నాయన్న కారణంగా ఇక్కడ ఏం జరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గుర్రంబోడు భూములకు సంబం ధించి కొంతమంది దగ్గర డాక్యుమెంట్లు లేవని, కొందరు బ్రోకర్లు.. ఉన్న డాక్యుమెంట్లు కొని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.  బిహార్‌ రౌడీలను పెట్టి అక్కడి గిరిజనులపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. 

ఉత్తమ్‌పై నిందలు తగవు: జీవన్‌రెడ్డి 
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల హక్కులు కాపాడటానికి ఉద్యమం చేసిన ఉత్తమ్‌పై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. భూములను 12 ఏళ్లపాటు ఎవరు సాగు చేస్తే వారివే అవుతాయని చెప్పారు. రాజ్యాంగ పదవిని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.    

మరిన్ని వార్తలు