టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకు సవాల్‌ విసిరిన వైఎస్‌ షర్మిల.. చర్చకు వచ్చే దమ్ముందా?

18 Sep, 2022 11:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు బేడీలంటే భయం లేదు.. నేను పులి బిడ్డను. దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటాను. అవినీతిపై మాట్లాడితే టీఆర్‌ఎస్‌ నేతలకు అంత వణుకెందుకు?. అవినీతిపై చర్చించే దమ్ముందా అని సవాల్‌ విసిరారు. 

పాదయాత్ర ఆపేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారు. మంత్రి నిరంజన్‌ రెడ్డిది నోరా? మోరినా? అని ఆగ్రహం చేశారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు. పోలీసులు టీఆర్‌ఎస్‌కు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలి. మంత్రి నిరంజన్‌ రెడ్డిపై మేము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్‌ చేసి పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గంగాపూర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. వైఎస్‌ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడక్కడా మిగిలిన పనులను సైతం సీఎం కేసీఆర్‌ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు