‘కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అందమైన అబద్ధం.. అద్భుతమైన మోసం’

29 Aug, 2022 01:58 IST|Sakshi

కొల్లాపూర్‌/సాక్షి,హైదరాబాద్‌/ పంజగుట్ట: ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అందమైన అబద్ధం.. అద్భుతమైన మోసం. కనీస ఎత్తులు చూడకుండా ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మించారు. కాంక్రీట్‌తో కాకుండా మట్టితో నిర్మిస్తే కూలిపోదా.. రూ.లక్షన్నర కోట్ల అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేసే బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో ఎందుకు సీబీఐ విచారణ జరిపించరు. టీఆర్‌ఎస్‌– బీజేపీ రెండూ దొందుదొందే’అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్‌ పాలనపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ హయాంలో రైతుకు ఏడాదికి రూ.30 వేల వరకు లబ్ధి చేకూరేదని, ఇప్పుడు రైతుబంధు పేరిట రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 80 వేలు భర్తీ చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం, 17 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్‌ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. 

షర్మిల పాలమూరు నీళ్ల పోరు..
సోమవారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా చేయనున్నట్టు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 

యూత్‌వింగ్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌గా హిందుజారెడ్డి
వైఎస్సార్‌టీపీ యూత్‌వింగ్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌గా గడ్డం హిందుజారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు షర్మిల తనకు అందచేశారని హిందుజారెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు