అది బందిపోట్ల రాష్ట్ర సమితి

11 Oct, 2022 00:54 IST|Sakshi
ఎల్లారెడ్డిలో ప్రసంగిస్తున్న వైఎస్‌ షర్మిల. చిత్రంలో వైఎస్‌ విజయమ్మ 

బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తిన వైఎస్‌ షర్మిల 

ఎల్లారెడ్డి: ఇన్నాళ్లూ ప్రజాసంక్షేమం మరిచి తాగుబోతుల రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారి దేశాన్ని దోచుకోబోతోందని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ టీఆర్‌ఎస్‌ పాలనలో ‘బీడి బిచ్చం కల్లు ఉద్దెర’గా మారిందని విచారం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ తన పాలనాకాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 60 ఏళ్లలోపు ఉన్నవారికి మాత్రమే రైతుబీమా వర్తిస్తుందనడం అమానుషమని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రతిపథకంలోనూ వైఎస్సార్‌ కనిపిస్తుంటారని, అట్లాంటివాటి పేర్లు మార్చి అవి తమవంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకుంటున్నారని అన్నారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల 175 రోజుల్లో 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటి రాజన్న బిడ్డగా ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిందని అన్నారు. షర్మిలను వైఎస్సార్‌ ఒక యువరాణిలా పెంచారని, పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆమె ప్రజల వద్దకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ నాయకులు నీలం రమేశ్, నీలం సుధాకర్, పిట్టా రాంరెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న తన ఆటపాటలతో సభికులను అలరించారు. 

మరిన్ని వార్తలు