ఎన్నికలు ఏవైనా.. గెలుపు వైఎస్సార్‌సీపీదే 

1 Mar, 2023 04:46 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

జగన్‌ పాలనలోనే బీసీలకు పెద్దపీట

టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స, ధర్మాన, సీదిరి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం వైఎస్సార్‌సీపీదేనని.. కుప్పంలోనే టీడీపీని కుప్పకూల్చేశామని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సీఎం జగన్‌ ఏపీని సంక్షేమాభివృద్ధి వైపు నడిపించారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలిగిన అనంతరం.. ఏప్రిల్‌ తర్వాత విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 18 మందికి గాను 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. టీడీపీ నేతల కుట్రలకు అవకాశం ఇవ్వకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావును గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. నాడు దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో, నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హయాంలో మాత్రమే యాదవులకు గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని.. దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సచివాలయాలతో పాటు విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ విప్లవం సృష్టించారని చెప్పారు.

వాస్తవ పరిశ్రమల స్థాపనకు అత్యధిక ఎంఓయూలు జరిగింది వైఎస్సార్‌సీపీ హయాంలోనేనని తెలిపారు. పట్టభద్రులను, ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు