CWG 2022: క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..!

26 Jul, 2022 14:54 IST|Sakshi

మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా  మహిళల క్రికెట్‌ భాగమైంది. ఇక ఓవరాల్‌గా దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన  కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే  క్రికెట్‌  టోర్నీను నిర్వహించారు. కాగా అజయ్‌ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది.

కాగా ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు అన్నీ బర్మింగ్‌హామ్‌ వేదికగానే జరగనున్నాయి. ఇక  కామన్వెల్త్ గేమ్స్‌ క్రికెట్‌ విభాగంలో గోల్డ్ మెడల్‌ సాధించల మూడు హాట్‌ ఫేవరెట్‌ జట్లును పరిశీలిద్దాం.

ఆస్ట్రేలియా
ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం చెలాయిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించే ఫేవరట్‌ జట్లలో ఆస్ట్రేలియాకు తొలి స్థానం ఇవ్వవచ్చు. అదే విధంగా మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసీస్‌ ఉంది.

ఇప్పటి వరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఐదు టైటిల్స్‌ను లానింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌ బౌలింగ్‌ పరంగా ఆస్ట్రేలియా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో బ్రెత్‌ మూనీ, కెప్టెన్‌ లానింగ్‌, మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ క్రికెటర్‌లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మేఘనా స్కాట్‌, జానెసన్‌ వంటి సీనియర్‌ బౌలర్లు ఉన్నారు.

ఇంగ్లండ్‌
ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే జట్లులో ఇంగ్లండ్‌ ఒకటి. అయితే ఈ లీగ్‌లో రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ.. ఫైనల్లో మాత్రం ఈ రెండు జట్లు ఢీకోనే అవకాశం ఉంది. మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 ఫైనల్లోను ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది.

అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ హీథర్ నైట్ అందుబాటుపై సంద్ఘిదం నెలకొంది. ఒక వేళ ఈ టోర్నీకి ఆమె దూరమైతే ఇంగ్లండ్‌కు గట్టి ఎదరుదెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే ఇంగ్లండ్‌ మాత్రం ఆల్‌ రౌండర్‌ నాట్ స్కివర్, వెటరన్‌ కేథరీన్ బ్రంట్, యంగ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లెస్టోన్ వంటి వారితో బలంగా కన్పిస్తోంది. 

భారత్‌
కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ రేసులో ఉన్న మరో జట్టు భారత్‌. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి మేటి జట్లకు భారత్‌ నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ పరిచిన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం తమ సత్తా చాటాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది.

ఇక భారత్‌ కూడా బ్యాటింగ్‌,బౌలింగ్‌ పరంగా పటిష్టం‍గా ఉంది. ఓపెనింగ్‌ జోడీ షఫాలీ వర్మ,స్మృతి మంధాన చేలరేగితే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో రాధా యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌లనే ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ప్రతిష్టాత్మక క్రీడల్లో నామమాత్రపు విజయాలు కాకుండా పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన పేర్కొన్న సంగతి తెలిసిందే.
చదవండి: Axar Patel- Six in Final Over List: ఆఖరి ఓవర్లో సిక్సర్‌ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే?

మరిన్ని వార్తలు