Arjun Tendulkar: ఎట్టకేలకు ఛాన్స్‌ దొరకబట్టిన సచిన్‌ తనయుడు

13 Dec, 2022 20:00 IST|Sakshi

Ranji Trophy 2022-23: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఎట్టకేలకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్‌.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్‌ అయి రంజీ ఛాన్స్‌ దొరకబట్టాడు. 

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్‌ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో అర్జున్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పటివరకు 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడిన అర్జున్‌కు ఇది తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ కావడం విశేషం. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన 23 ఏళ్ల అర్జున్‌.. గ్రూప్‌-సిలో భాగంగా ఇవాళ రాజస్తాన్‌తో మొదలైన మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోవా.. సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (81 నాటౌట్‌), స్నేహల్‌ సుహాస్‌ ఖౌతాంకర్‌ (59) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సుయాశ్‌, అర్జన్‌ టెండూల్కర్‌ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్తాన్‌ బౌలర్లలో అంకిత్‌ చౌధరీ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్‌ ఖాన్‌, కమలేశ్‌ నాగర్‌కోటీ, మానవ్‌ సుతార​ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ టెండూల్కర్‌.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఎంత సచిన్‌ కుమారుడైనా టాలెంట్‌ ఉంటేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని ముంబై కోచ్‌ జయవర్ధనే అప్పట్లో ప్రకటించాడు.

ఎట్టకేలకు అర్జున్‌ తన స్వయంకృషితో గోవా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆటతీరుపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. 

మరిన్ని వార్తలు